Heavy Rains: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... ఏపీ-ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు

Heavy rains causes halt road transport between AP and Odisha
  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
  • పలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రులు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న అచ్చెన్న
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ ప్రకటించింది. 

ఇవాళ కూడా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎగువన కూడా వర్షాలు కురుస్తుండడంతో శబరి నదితో పాటు, పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీ-ఒడిశా మధ్య ఉన్న 316 జాతీయ రహదారిపై పలు చోట్ల గండ్లు పడ్డాయి. చింతూరు-కల్లేరు గ్రామాల మధ్య గండ్లు పడడంతో ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

భారీ వర్షాల నేపథ్యంలో, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. 

సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఉపయోగించాలని అచ్చెన్నాయుడు సూచించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించేలా  సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. వాయుగుండం కొనసాగుతున్నందున, మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. 

అటు, హోంమంత్రి అనిత వర్షాలపై విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఆయా జిల్లాల్లో వర్షాల ప్రభావం, ఇతర పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, అల్లూరి జిల్లాలో ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ సూచనలతో వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆహారం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
Heavy Rains
AP
Odisha
Depression
IMD

More Telugu News