Gautam Gambhir: కోచ్ గౌతమ్ గంభీర్ సహాయ సిబ్బంది ఖరారు!

Reports Saying BCCI all set to appoint Abhishek Nayar and Ryan Ten Doeschate as assistant coaches of the Indian cricket team
  • సహాయక కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్‌ ఖరారయ్యారంటూ కథనాలు
  • ద్రావిడ్ ఆధ్వర్యంలో పని చేసిన ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ను కొనసాగించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని పేర్కొన్న ‘క్రిక్‌బజ్’
  • త్వరలోనే ప్రారంభం కానున్న శ్రీలంక టూర్‌తో బాధ్యతలు స్వీకరించనున్న నూతన కోచింగ్ సిబ్బంది
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సహాయ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్‌లను నియమించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయక పోయినప్పటికీ శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల నుంచి వీరిద్దరూ గంభీర్‌తో కలిసి బాధ్యతలు స్వీకరిస్తారని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. కాగా అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. ఇక ఐర్లాండ్ మాజీ ఆటగాడైన ర్యాన్ టెన్ డోస్చాట్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గతంలో ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. మరోవైపు రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన తెలుగు వ్యక్తి టి.దిలీప్‌ను కూడా నూతన సహాయక సిబ్బందిలో కొనసాగించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

కాగా బౌలింగ్ కోచ్ నియామకంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్‌ను బలమైన పోటీదారుగా బీసీసీఐ పరిగణిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడినప్పుడు మోర్కెల్‌తో గంభీర్‌ కలిసి పనిచేశాడు. 2014, 2016 ఐపీఎల్ సీజన్లలో గంభీర్ కెప్టెన్సీలో మోర్కెల్ ఆడాడు.

బౌలింగ్ కోచ్‌పై స్పష్టత రానప్పటికీ దిలీప్, అభిషేక్ నాయర్‌లతో కలిసి కోచ్ గంభీర్ శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాడని ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది. కాగా ర్యాన్ టెన్ డోస్చాట్ జట్టుతో ఎప్పుడు కలుస్తాడనేది తెలియరాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ‘మేజర్ లీగ్ క్రికెట్’లో ఎల్ఏ నైట్ రైడర్స్ కోచింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ర్యాన్ టెన్ పనిచేస్తున్నాడు.
Gautam Gambhir
BCCI
Team India
Cricket

More Telugu News