Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై త్వరలో మరో హత్యాయత్నం!

Iran reportedly planning to assassinate Donald Trump separate from Pennsylvania shooting
  • జనరల్ సులేమానీ హత్యకు ట్రంప్‌పై ప్రతీకారం కోసం ఇరాన్ ప్రయత్నమంటూ వార్తలు
  • ఇరాన్ ప్రయత్నాలపై నిఘా వర్గాలకు ఆధారాలు అందాయని మీడియాలో కథనం
  • ఈ వార్తలను ఖండించిన ఇరాన్
  • ప్రముఖుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్న అమెరికా ప్రభుత్వం
ఇటీవలే హత్యాయత్నం నుంచి బయటపడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి దాడికి యత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే అంటోంది అమెరికా ప్రభుత్వం. ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని భావిస్తున్న అమెరికా ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. ఇటీవల ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నానికి ముందే అతడిని అంతమొందించే ప్లాన్‌‌ను ఇరాన్ సిద్ధం చేసుకుందని అమెరికా అంటోంది. 

2020లో ఇరాన్ టాప్ జనరల్ కాసీమ్ సులేమానీ హత్యకు గురైన విషయం తెలిసిందే. నాటి నుంచీ ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ట్రంప్‌ను టార్గెట్ చేసుకుందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం కోన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నా ఈ మధ్య కాలంలో ఇరాన్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్టు అమెరికా దృష్టికొచ్చింది. రాబోయే వారాల్లో ట్రంప్‌పై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అమెరికా పత్రికల్లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. 

కాగా, ఈ వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారం, వివక్ష పూరితమని వ్యాఖ్యానించింది. సులేమాని హత్యకు కారణమైన ట్రంప్ తమ దృష్టిలో నేరగాడు అయినప్పటికీ అతడిపై చర్యలు తీసుకునేందుకు తాము చట్టబద్ధమైన మార్గంలోనే వెళతామని స్పష్టం చేసింది. ఇక నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం.. మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, మాజీ జాతీయ భద్రతాసలహాదారు జాన్ బోల్టన్‌ను అదనపు భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. రాబోయే ప్రమాదాలకు సంబంధించి తాము ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటామని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదాల నివారణకు సమీకృత చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించినట్టు వెల్లడించారు.
Donald Trump
Assasination Attempt
Irans Revenge

More Telugu News