Joe Biden: ట్రంప్‌ పై కాల్పులకు పాల్పడ్డ నిందితుడిపై ఊహాగానాలు వద్దు.. అమెరికన్లకు అధ్యక్షుడు బైడెన్ సూచన

Biden asks Americans not to make assumptions on shooters motive as FBIs probe continues
  • మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై దాడి వివరాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించిన  అధికారులు
  • అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్
  • ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చిన వైనం
  • తాము ఒకరికొకరు శత్రువులం కామని, ఇరుగుపొరుగు అన్న విషయం గుర్తుంచుకోవాలని వినతి
పెన్సిల్వేనియా ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ నిందితుడి ఉద్దేశాలు, అతడి రాజకీయ భావజాలం గురించి ఎటువంటి ఊహాగానాలు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలను కోరారు. ప్రజలందరూ ఒకే దేశంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. హత్యాయత్నం పూర్వాపరాలపై అధికారుల నుంచి సమాచారం అందుకున్నారు. ఇంతటి ప్రమాదం ఎలా జరిగిందో స్వతంత్ర సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బైడెన్ శ్వేతసౌధనం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 

ఆగ్రహావేశాలు చల్లార్చుకోవాలని బైడెన్ తన ప్రసంగంలో ప్రజలకు పిలుపునిచ్చారు. తామందరం ఒకే దేశ పౌరులమని, ఇరుగుపొరుగు వారమే కానీ శత్రువులం కాదన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. జాతి మొత్తం ఏకం కావాలని, అందరూ ఒక్కతాటిపైకి రావాలని అన్నారు. అమెరికన్లు క్షణకాలం పాటు అడుగువెనక్కు వేసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలియజెప్పిందన్నారు. 

‘‘ఒకే దేశానికి చెందిన వారిగా, అమెరికన్లుగా మనకు ఇది తగదు. ఇలాంటివి జరగనీయకూడదు. ఐకమత్యం సాధించడం అత్యంత కష్టమైన లక్ష్యం. కానీ ఇంతకు మించినది ప్రస్తుతం మరొకటి లేదు. నిందితుడి అభిప్రాయాలు, అతడి రాజకీయ నేపథ్యాలు మనకు తెలియవు. అతడు ఒంటరిగా ఈ దాడి చేశాడా? లేక ఎవరైనా సాయం చేశారా? అన్నది కూడా తెలియదు. ఈ విషయాలపై దర్యాప్తు సంస్థల అధికారులు దృష్టి పెట్టారు’’ అని బైడెన్ పేర్కొన్నారు. 

సోమవారం మిల్వాకీలో జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పునఃసమీక్షించాలని సీక్రెట్ సర్వీసు అధికారులకు తాను సూచించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ కన్వెన్షన్‌కు సంబంధించి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని కన్వెన్షన్‌ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్న సీక్రెట్ సర్వీస్ అధికారి పేర్కొన్నారు. 

మరోవైపు, ఈ హత్యాయత్నాన్ని దేశీయమూలాలున్న ఉగ్రవాద ఘటనగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఒంటరిగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అంచనాకు వచ్చారు. అయితే, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంతకుమించి చెప్పేందుకు ఏమీ లేదని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే పేర్కొన్నారు.
Joe Biden
Donald Trump

More Telugu News