Road Accident: జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు

Dreaded accident near Jadcherla APSRTC bus caught fire
  • బురెడ్డిపల్లి సమీపంలో గత రాత్రి 1.45 గంటలకు ఘటన
  • గాయాలతో బయటపడిన ప్రయాణికులు 
  • క్షతగాత్రుల్లో ఏపీ, తెలంగాణ ప్రయాణికులు
  • మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అగ్నికి ఆహుతైంది. బస్సు, డీసీఎం వ్యాను ఒకదానికొకటి ఢీకొనడంతో బస్సులో మంటలు అంటుకుని ఆ తర్వాత కాసేపటికే దగ్ధమైంది. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులందరూ గాయాలతో బయటపడ్డారు. గత రాత్రి 1.45 గంటల సమయంలో జరిగిందీ ఘటన.

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు రాత్రి 12 గంటలకు హైదరాబాద్‌లోని ఎంబీబీఎస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. బురెడ్డిపల్లి మలుపు వద్ద డీసీఎం వాహనం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో బస్సు, డీసీఎం ఢీకొన్నాయి. 

దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులు బయటకు వచ్చిన కాసేపటికే బస్సులో మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో హైదరాబాద్, అనంతపురం జిల్లాల వారు ఉన్నారు. గాయపడిన 15 మంది ప్రయాణికుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Road Accident
APSRTC
Andhra Pradesh
Hyderabad
Mahbubnagar District

More Telugu News