Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుశ్చర్య.. వీడియో ఇదిగో

Donald Trump was fired a series of gunshots at a campaign rally on Saturday in Pennsylvania
అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రంప్‌నకు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావమయింది. బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించిన వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో కిందకు వంగారు. 

తక్షణమే అప్రతమత్తమైన భద్రతా సిబ్బంది మాజీ అధ్యక్షుడికి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిలో నిందితుడు కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అనూహ్య రీతిలో జరిగిన కాల్పుల ఘటనతో ఎన్నికల ర్యాలీలో ఒక్కసారిగా అరుపులు, కేకలతో గందరగోళం నెలకొంది. బుల్లెట్ గాయాల పాలైన ట్రంప్‌ చెవి, ముఖంపై రక్తం కనిపించాయి. ఒక చేతితో చెవిని పట్టుకున్నారు. కాగా ట్రంప్‌ను హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలో ఆయన పిడికిలి బిగించి ఎన్నికల ర్యాలీలోని ప్రజలకు చూపించారు. కాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారంటూ సీక్రెట్ సర్వీస్ ‘ఎక్స్‌’ వేదికగా నిర్ధారించింది. ఆయన బాగానే ఉన్నారని, వైద్యులు ఆయనను పరిశీలిస్తున్నారని తెలియజేశారు.

అనుమానితుడు మృతి!
ట్రంప్‌పై కాల్పులకు తెగబడిన అనుమానాస్పద షూటర్ మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. షూటర్‌తో పాటు పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా చనిపోయారని బట్లర్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ గోల్డింగర్ చెప్పినట్టుగా ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది.

దుశ్చర్యను ఖండించిన అధ్యక్షుడు జో బైడెన్
ట్రంప్‌పై కాల్పుల విషయాన్ని సీక్రెట్ సర్వీస్ చీఫ్ ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్  తెలుసుకున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘ పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల ఘటన గురించి నాకు సమాచారం అందింది. ట్రంప్ క్షేమంగా, బాగానే ఉన్నారని తెలియడం సంతోషం. ట్రంప్ కోసం, ఆయన కుటుంబం కోసం, ర్యాలీలో పాల్గొన్నవారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. ట్రంప్‌ను సురక్షితంగా రక్షించిన సర్వీస్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదు. దేశమంతా ఒక్కటై ఈ హింసను ఖండించాలి’’ అని జో బైడెన్ పేర్కొన్నారు. కాగా అమెరికాలోని అన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.
Donald Trump
Donald Trump hit by gunshots
USA
Joe Biden
America

More Telugu News