Pawan Kalyan: అక్కడ పవన్ కల్యాణ్ ఫొటోలు ఉన్నట్లు తెలంగాణ ఆఫీసుల్లో భట్టివిక్రమార్కవి కూడా ఉండాలి: మోత్కుపల్లి నర్సింహులు

Mothkupalli demands for Bhatti photo in government offices
  • ఏపీలో చంద్రబాబుతో సమానంగా కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటోలు ఉన్నాయన్న మోత్కుపల్లి  
  • నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్
  • తెలంగాణలో ఎక్కడి నుంచి పోటీ చేసినా 10 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబుతో సమానంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలు అన్ని కార్యాలయాలలో కనిపిస్తున్నాయని... అలాగే తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టివిక్రమార్క ఫొటోలు కూడా ఉండాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. గురువారం ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో కలిసి సన్నిధి హోటల్‌లో కేక్ కట్ చేశారు. 

ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ... అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రేవంత్, భట్టివిక్రమార్క ఫొటోలు ఉండాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. తన భవిష్యత్తు కార్యచరణ పోరాటమే తప్ప మరేమీలేదని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బిక్షమయ్య గౌడ్, బీర్ల ఐలయ్యలకు మద్దతిచ్చి గెలిపించానన్నారు. తన హయాంలో లంచాలు, ఫైరవీలు లేకుండా చేశానన్నారు. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం రాలేదన్నారు.

తెలంగాణలో తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా పది వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు యాదగిరిగుట్టలో అర్ధగజం భూమి కూడా లేదని... ఎలాంటి ఆస్తులు సంపాదించలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలలో కోట్లాది రూపాయలకే విలువ ఉందని... ప్రజలకు సేవ చేసేవారికి విలువ లేదన్నారు. బడుగు బలహీన వర్గాల వారి తరఫున తాను ఎల్లప్పుడూ పోరాడుతానే ఉంటానన్నారు.
Pawan Kalyan
Janasena
Mallu Bhatti Vikramarka
Mothkupalli Narsimhulu

More Telugu News