Gautam Gambhir: కోచ్‌గా గంభీర్ నియామకానికి ముందు కోహ్లీ అభిప్రాయం తీసుకోని బీసీసీఐ

Kohli not consulted by BCCI before Gautam Gambhir appointment as India head coach
  • ఇద్దరి మధ్య గతంలో జరిగిన గొడవే కారణమా?
  • సాధారణంగా కోచ్ నియమాకం విషయంలో కెప్టెన్, మాజీ కెప్టెన్ అభిప్రాయాలు తీసుకోవడం ఆనవాయతీ
  • ఈసారి మాత్రం దానికి చెక్ పెట్టిన బీసీసీఐ
  • గంభీర్ పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించిన సీఏసీ
  • అతి పిన్నవయస్కుడైన భారత జట్టు కోచ్‌గా గంభీర్ రికార్డ్
టీమిండియా హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకానికి సంబంధించి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని బీసీసీఐ తీసుకోలేదని తెలిసింది. సాధారణంగా కొత్త కోచ్‌ను నియమించే సమయంలో కెప్టెన్, మాజీ కెప్టెన్ అభిప్రాయాన్ని తీసుకోవడం పరిపాటి. కానీ, ఈసారి మాత్రం బీసీసీఐ ఈ సంప్రదాయానికి చెక్ పెట్టింది. అయితే, బీసీసీఐ నిర్ణయం వెనక మరో కారణం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ సమయంలో కోహ్లీ-గంభీర్ ఇద్దరూ మైదానంలోనే గొడవ పడడం అప్పట్లో సంచలనమైంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 2023లో గంభీర్ మెంటార్‌గా వ్యవహరించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య వివాదం చెలరేగింది. మైదానంలోనే గంభీర్‌పైకి కోహ్లీ దూసుకెళ్లడం అప్పట్లో సంచలనమైంది. అయితే, ఇటీవలి ఐపీఎల్‌లో ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయి. అయినప్పటికీ కోచ్ నియామకం విషయంలో కోహ్లీ అభిప్రాయం తీసుకోవాలని బీసీసీఐ భావించకపోవడం గమనార్హం. 

అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌తో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కోచ్‌గా గంభీర్ పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. మంగళవారం గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించినట్టు పేర్కొంటూ బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌తో గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. 42 ఏళ్ల గంభీర్ అత్యంత పిన్న వయస్కుడైన భారత కోచ్‌గా రికార్డులకెక్కాడు.
Gautam Gambhir
Virat Kohli
Team India
Head Coach
BCCI

More Telugu News