Revanth Reddy: పార్టీని వీడిన వారిని ఆహ్వానించిన భట్టివిక్రమార్క... పీసీసీ అధ్యక్షుడిగా సమర్థిస్తున్నానన్న రేవంత్ రెడ్డి

Revanth Reddy welcomes Bhattivikramarka comments
  • కలిసి పని చేద్దామంటూ పార్టీని గతంలో వీడిన వారికి డిప్యూటీ సీఎం పిలుపు
  • ఉపముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో ఏకీభవిస్తున్నానన్న రేవంత్ రెడ్డి
  • రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా అందరూ రావాలన్న సీఎం
కాంగ్రెస్‌ను వీడిన నేతలు అందరూ తిరిగి రావాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆహ్వానించగా... ఆ మాటలను సమర్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గాంధీ భవన్‌లో వైఎస్ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టివిక్రమార్క... పార్టీని వీడిన నేతలను తిరిగి రావాలని కోరారు.

ఆయన మాట్లాడుతూ... 'రండి... కలిసి పని చేద్దాం. సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్న నాటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పార్టీలోకి రావాలని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాన'ని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు గ్రామాల్లో తల ఎత్తుకొని తిరిగేలా ఈ ప్రభుత్వం పని చేస్తుందని మాట ఇస్తున్నామన్నారు.

అనంతరం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ... కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి... రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. మనమంతా కలిసికట్టుగా నిలబడి... దేశాన్ని బలోపేతం చేసేందుకు పని చేయాలన్నారు. పార్టీని వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఉపముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో తాను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నానని... పీసీసీ అధ్యక్షుడిగా సమర్థిస్తున్నానని అన్నారు.
Revanth Reddy
Congress
Mallu Bhatti Vikramarka

More Telugu News