NEET: నీట్ పరీక్షపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం

Union govt submits affidavit on NEET paper leakage issue in Supreme Court
  • నీట్ పేపర్ లీకేజిపై దేశవ్యాప్తంగా దుమారం 
  • సుప్రీంకోర్టులో విచారణ
  • నీట్ పరీక్ష రద్దు చేసేది లేదన్న కేంద్రం
  • ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడి
  • నీట్ రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని వివరణ
జాతీయ స్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 

నీట్ పరీక్షను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది. పోటీ పరీక్షలను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజి కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని తన అఫిడవిట్ లో వెల్లడించింది. 

అయితే, భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. అందువల్ల నీట్ పరీక్ష రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడింది. నీట్ పరీక్షను రద్దు చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని వివరించింది.
NEET
Paper Leak
Supreme Court
Affidavit
Union Govt
India

More Telugu News