Nara Lokesh: మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు: మంత్రి నారా లోకేశ్ ఫైర్

Nara Lokesh fires on Jagan over mid day meal pending payments
  • గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు గత  వైసీపీ సర్కారు రూ.178.5 కోట్ల బకాయిలు
  • బకాయిలు చెల్లించకపోవడంతో పలు పాఠశాలల్లో గుడ్ల సరఫరా నిలిపివేత. 
  • వెంటనే సంబంధిత అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష
జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని మరోమారు తేటతెల్లమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. చిన్నారులకు మేనమామలా ఉండి వారి యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పిన నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి విద్యార్థులు, చిన్నారులకు తీరని ద్రోహం చేశారని, వారి నోళ్లు కొట్టారని మండిపడ్డారు. 

మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నారా లోకేశ్ నేడు సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇవ్వాల్సిన గుడ్డును ఇవ్వడం లేదన్న విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన లోకేశ్ సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా గుడ్ల కాంట్రాక్టర్లకు డిసెంబర్ నుంచి 112.5 కోట్ల రూపాయలు, చిక్కీల కాంట్రాక్టర్లకు గతఏడాది ఆగస్టు నుంచి రూ.66 కోట్ల మేర జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయిందన్న విషయాన్ని అధికారుల ద్వారా లోకేశ్ తెలుసుకున్నారు. భారీగా బిల్లులు బకాయి పడటంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ గుడ్ల సరఫరా నిలిపివేసిన విషయాన్ని గుర్తించారు. 

వాస్తవం ఇలా ఉంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు గుడ్ల పంపిణీ నిలిపివేశారంటూ వైసీపీ అనుకూల మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లు, చిక్కీలకు గత ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టి వెళ్లడంపై ఆయన విస్మయం వ్యక్తంచేశారు. 

చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గుడ్లు, చిక్కీలను పంపిణీ చేయాలని, గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన బకాయిలను అతి త్వరలో చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లంతా మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. 

ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, మధ్యాహ్న భోజన పథకం డైరక్టర్ బి.శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. 

ఇదిలావుండగా...ఇటీవల విద్యాశాఖపై మంత్రి లోకేష్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో గత ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవెన పథకాల కింద రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడంతో వారి సర్టిఫికెట్లు వివిధ విద్యాసంస్థల్లో నిలచిపోయిన విషయం వెల్లడైంది. మేనమామలా చూసుకోవడమంటే విద్యార్థులు, చిన్నారులను అవస్తల పాలుజేయడమా? అని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.
Nara Lokesh
Jagan
Midday Meal
Pending Payments
TDP
YSRCP

More Telugu News