Real Estate in Heaven: స్వర్గంలో ప్లాట్ల అమ్మకం .. ఎంచక్కా దేవుడి పక్కనే ఉండొచ్చంటూ స్పెయిన్ చర్చ్ ప్రచారం!

Spanish Church Sells Land In Heaven For 100 Dollors For Sq Meter
  • చదరపు మీటర్ కు కేవలం వంద డాలర్లే.. బ్రోచర్ విడుదల చేసిన చర్చ్ పాస్టర్
  • 2017లో దేవుడితో జరిగిన ఓ సమావేశంలో ఈ ప్రతిపాదనకు పర్మిషన్ తీసుకున్నాడట
  • ఇప్పటికే పలువురికి అమ్మకం.. లక్షలాది డాలర్లు పోగేసుకున్న చర్చ్
చంద్రుడిపై రియల్ ఎస్టేట్ ఇటీవల జోరుగా జరిగింది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతమై విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత అక్కడి ల్యాండ్ కొని, తమకు ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ స్పెయిన్ కు చెందిన ఓ చర్చి ఫాస్టర్ ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతానంటూ ఆన్ లైన్ లో ప్రకటనలు గుప్పించాడు. చదరపు మీటర్ కు కేవలం వంద డాలర్లేనని చెబుతూ.. స్వర్గంలోని స్పెషల్ ఏరియాలో ఒక్క ప్లాట్ కొనుక్కుంటే సాక్షాత్తూ దేవుడి పక్కనే ఉండొచ్చని అంటున్నాడు. స్వర్గంలో రియల్ ఎస్టేట్ ఏంటయ్యా అనే వాళ్లకు ఇంకో షాకింగ్ విషయమూ చెప్పాడు. అదేంటంటే.. ఈ దందాకు దేవుడి అనుమతి కూడా ఉందట. 2017లో దేవుడితో జరిగిన ఓ సమావేశంలో తాను ఈ రియల్ ఎస్టేట్ ప్రతిపాదనను ఆయన ముందుంచానని, దీనిని పరిశీలించి దేవుడు ఓకే చెప్పాడని అంటున్నాడు.

స్వర్గంలో ప్లాట్స్ అమ్ముతున్నాం అంటూ సదరు చర్చి ఫాస్టర్ ఓ బ్రోచర్ కూడా ప్రింట్ చేసి జనాలకు పంచుతున్నాడు. అందులో మేఘాల మధ్యలో ఓ విల్లా, దానిని చేరుకునేందుకు మెట్లగుండా వెళుతున్న ఓ కుటుంబం ఫొటోను అచ్చు వేయించాడు. దేవుడి చెంతనే నివాసం ఉండే అవకాశం.. దీనికి మాది గ్యారంటీ అంటూ నగదు చెల్లించేందుకు రకరకాల ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు గూగుల్ పే, యాపిల్ పే వంటి యూపీఐ పేమెంట్ సదుపాయం కూడా ఉందని చెప్పాడు.

స్వర్గంలో భూములు అమ్ముతానని ఫాస్టర్ చెప్పడం సరే, ఆ మాటలు నమ్మేదెవరు, కొనేదెవరు అనుకుంటున్నారా.. అయితే, మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఇప్పటికే సదరు ఫాస్టర్ స్వర్గంలో భూముల అమ్మకం ద్వారా లక్షలాది డాలర్లు ఆర్జించాడట. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలాంటి డీల్ ఒకటి ఉగాండాలో జరిగింది. యూనివర్సల్ అపొస్తొల్ చర్చి ఫాస్టర్ ఫ్రెడ్ ఇసాంగా కూడా ఇలాగే స్వర్గంలో భూములు అమ్ముతానంటూ ప్రకటనలు గుప్పించాడు. దీంతో ఆయన ఫాలోవర్లు కొంతమంది స్వర్గంలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు భూమి మీద తమకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నారు.
Real Estate in Heaven
Plots Sale
Spain Church
Heaven
Offbeat

More Telugu News