DNA Test: గిరిజనులకు డీఎన్ఏ టెస్టు చేయాలన్న రాజస్థాన్ మంత్రి.. దుమారం రేపుతున్న వ్యాఖ్యలు

Row over Rajasthan Education Minister Dilawar DNA test of tribals comments
  • మంత్రి దిలావర్ మానసిక స్థిమితం కోల్పోయారన్న కాంగ్రెస్
  • దిలావర్ రాజీనామాకు ఎంపీ రాజ్‌కుమార్ డిమాండ్
  • మంత్రి, సీఎంకు గిరిజనులు రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు పంపిస్తామని హెచ్చరిక 
గిరిజనులు హిందువులో, కాదో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్టు చేస్తామన్న రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కోటాలోని మండి నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గిరిజనులు హిందువులు కాదంటూ బీఏపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. ‘‘వారు హిందువులా? కాదా? అన్న విషయాన్ని వారి పూర్వీకులను అడిగి తెలుసుకుంటాం. వంశవృక్షం నమోదు చేసిన వారిని సంప్రదిస్తాం. ఒకవేళ వారు హిందువులు కాకపోతే వారు ఆ తల్లిదండ్రుల బిడ్డలేనా అని తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. 

మంత్రి వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. బన్సవారా ఎంపీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ డీఎన్ఏ పరీక్ష కోసం తమ రక్తం , గోళ్లు, వెంట్రుకల నమూనాలను మంత్రి దిలావర్, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు పంపాలని గిరిజనులను కోరుతూ ప్రచారం ప్రారంభిస్తానని హెచ్చరించారు. గిరిజనులను మంత్రి అవమానించారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

దిలావర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా విరుచుకుపడింది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా మాట్లాడుతూ దిలావర్ మానసిక స్థిమితం కోల్పోయారని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతాప్‌గఢ్‌లో ఆదివాసీ యువమోర్చా నిరసన ప్రదర్శన చేపట్టింది. మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేసింది.
DNA Test
Tribes
Madan Dilawar
Hindus
Rajasthan

More Telugu News