Virat Kohli: కోహ్లీ, రోహిత్‌లకు అదే చివరి అవకాశం.. బీసీసీఐ ముందు గంభీర్ సంచలన ప్రతిపాదన!

Gambhir proposes 2025 Champions Trophy in Pakistan could be the last opportunity for four senior players including Virat Kohli and Rohit Sharma
  • పాకిస్థాన్‌లో జరగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీనే లాస్ట్ ఛాన్స్ అని గంభీర్ ప్రతిపాదన
  • ట్రోఫీ గెలవడంలో భారత్ విఫలమైతే సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టాలని డిమాండ్
  • కోహ్లీ, రోహిత్‌లతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలను కూడా పక్కన పెట్టాలని ప్రతిపాదన
టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అందరికంటే ముందున్న విషయం తెలిసిందే. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌తో ముగిసిపోనుంది. దీంతో త్వరలోనే కొత్త కోచ్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా కోచ్ పదవికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న గౌతమ్ గంభీర్ గతవారం ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాడు. ఈ మాజీ ఓపెనర్‌ను బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ప్రశ్నించింది. అయితే ఈ సందర్భంగా కమిటీ ముందు గంభీర్ పలు కీలకమైన ప్రతిపాదనలు చేశాడని కథనాలు వెలువడుతున్నాయి.

గంభీర్ మొత్తం 5 ప్రతిపాదనలు చేశాడని ‘నవభారత్ టైమ్స్’ పేర్కొంది. మొదటి డిమాండ్‌గా.. జట్టు విషయంలో బీసీసీఐ ఎలాంటి జోక్యం చేసుకోకూడదని, క్రికెట్ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ తనకే ఉండాలని గంభీర్ డిమాండ్ చేసినట్టు కథనం పేర్కొంది. 

ఇక రెండవ డిమాండ్‌గా.. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్‌లు సహా సహాయక సిబ్బంది అందరినీ తానే ఎంపిక చేసుకుంటానని గంభీర్ చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు 2025లో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి అవకాశమని గంభీర్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. టోర్నీని గెలిపించడంలో ఈ నలుగురు సీనియర్లు విఫలమైతే జట్టు నుంచి పక్కన పెట్టాలని కోరాడని ‘నవభారత్ టైమ్స్’ కథనం పేర్కొంది. అయితే అన్ని ఫార్మాట్ల నుంచి తొలగించాలా? లేదా? అనే విషయం తెలియరాలేదు.

ఇక నాలుగవ షరతుగా టెస్టు క్రికెట్‌కు ప్రత్యేక జట్టు ఉండాలని గంభీర్ ప్రతిపాదించాడని తెలుస్తోంది. చివరిగా కోచ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ప్రణాళికను సిద్ధం చేసుకొని దాని ఆచరణ ప్రారంభిస్తానని గంభీర్ ప్రతిపాదించాడని కథనం పేర్కొంది. 

కాగా కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై ఇప్పటికే అనిశ్చితి నెలకొన్న వేళ కోచ్‌గా గంభీర్ పేరు వినిపిస్తుండడంతో వారి కొనసాగింపు మరింత ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని ఈ పరిణామాలను చూస్తే అర్థమవుతోంది.
Virat Kohli
Rohit Sharma
Gautam Gambhir
Ravindra Jadeja
Mohammad Shami
Cricket
BCCI
T20 World Cup 2024
Champions Trophy 2025

More Telugu News