India vs Australia: భారత్-ఆసీస్ మధ్య నేడు కీలక పోరు.. మ్యాచ్ రద్దయితే సెమీస్ సమీకరణాలు ఇలా..!

India will qualify for semis if rain washes out match against Australia
  • నేటి మ్యాచ్ రద్దయితే నేరుగా సెమీస్‌కు భారత్
  • సంక్లిష్టం కానున్న ఆస్ట్రేలియా అవకాశాలు
  • నేటి మ్యాచ్‌కు 40 శాతం వర్షం ముప్పు
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ నేడు (సోమవారం) అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. సూపర్-8 దశలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకమైనది. మొత్తం ఐదు విజయాలతో టీమిండియా మంచి దూకుడు మీద ఉంది. సూపర్-8 దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా సెమీస్ బెర్త్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. 

మరోవైపు ఆస్ట్రేలియా జట్టు అనూహ్య రీతిలో గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో అటు ఆసీస్.. ఇటు భారత్ జట్లకు నేటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం ఒక సెమీస్ బెర్త్‌ని ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ‘అక్యూవెదర్’ రిపోర్ట్ ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. మ్యాచ్‌ సమయంలో వాన పడే అవకాశం 40 శాతంగా ఉందని పేర్కొంది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే..
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే సెమీస్ సమీకరణాలు ఆసక్తికరంగా మారతాయి. భారత్ మ్యాచ్ గెలిస్తే దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. పర్యవసానంగా మొత్తం ఐదు పాయింట్లతో టీమిండియా సెమీస్‌లో అధికారికంగా అడుగుపెడుతుంది. ఈ సమీకరణంలో ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు మాత్రమే ఉంటాయి. 

ఆసీస్ మూడు పాయింట్లకు పరిమితం అయితే.. ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఎన్ని పాయింట్లతో ఏ స్థానంలో నిలుస్తుందనే దాన్ని బట్టి రెండో సెమీస్ స్థానం ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్ తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధిస్తే నాలుగు పాయింట్లతో సెమీస్ చేరుతుంది.

ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఆసీస్ ఓడిపోతే జట్టు అవకాశాలు అత్యంత జటిలంగా మారతాయి. ఇక భారత్‌పై ఆసీస్ గెలిస్తే నాలుగు పాయింట్లతో సెమీస్ రేసులో ఉంటుంది. ఇక బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్థాన్ కూడా గెలిస్తే ఈ రెండు జట్లు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్‌కు పోటీ పడనున్నాయి. భారత్ చేతిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోయిన సమీకరణంలో కూడా నెట్ రన్ రేట్ కీలకం కానుంది.
India vs Australia
T20 World Cup 2024
Cricket
Team India
Team Australia

More Telugu News