Peddapalli: పెద్దపల్లిలో దారుణం.. మైన‌ర్‌ బాలిక‌పై హత్యాచారం!

Minor Girl Raped and Murdered by Driver in Peddapalli
  • పెద్దపల్లి జిల్లాలోని కాట్నపల్లిలో ఘ‌ట‌న‌ 
  • రైస్ మిల్లు వద్ద తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం
  • సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు బల‌రాంను గుర్తించిన కార్మికులు
పెద్దపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాట్నపల్లిలో ఓ రైస్ మిల్లు వద్ద చోటుచేసుకుంది. రైసు మిల్లులో గురువారం రాత్రి తల్లితోపాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న బల‌రాం ఎత్తుకెళ్లాడు. 

అనంతరం సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. బాలిక బతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భావించి అక్కడే గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొంత సమయానికి కుతూరు తన పక్కన కనిపించకపోవడంతో తోటి కార్మికులకు త‌ల్లి విషయం చెప్పింది. దాంతో వారందరూ కలిసి పరిసరాల్లో వెతికారు. ఈ క్రమంలో ఓ పొదల్లో విగతజీవిగా పడి ఉన్న బాలిక మృత దేహాన్ని గుర్తించారు. 

కాగా, గురువారం అర్ధరాత్రి బ‌ల‌రాం ఆ బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. వెంటనే స్థానికులు నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష చేయనున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Peddapalli
Minor Girl
Telangana

More Telugu News