T20 World Cup 2024: నేటి మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోతే ఏం జరుగుతుంది?

How Pakistan Can Miss Out T20 World Cup 2024 Super 8 Qualification
  • భారత్ చేతిలో ఓడితే సంక్లిష్టంగా మారనున్న పాక్ సూపర్-8 అవకాశాలు!
  • ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పాకిస్థాన్‌కు ప్రమాదకరంగా మారిన అమెరికా
  • పాక్ తదుపరి మ్యాచ్‌ల్లో గెలుపుతో కీలకం కానున్న నెట్ రన్ రేట్
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య నేడు (ఆదివారం) హైవోల్టేజీ క్రికెట్ సమరం జరిగింది. రాత్రి 8 గంటలకు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. సంచలన రీతిలో అమెరికా చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకమైనది. ఈ మ్యాచ్‌లో సత్తా చాటి సూపర్-8 రేసులో ఉండాలని బాబర్ ఆజం సేన పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోతే ఆ జట్టు సూపర్-8 అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారతాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌‌లు గెలిచిన అమెరికా.. పాకిస్థాన్‌పై ప్లే ఆఫ్ అవకాశాలపై నీళ్లు చల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్, పాకిస్థాన్, అమెరికా, ఐర్లాండ్, కెనడా దేశాలు ఉన్న గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక గమనిస్తే.. రెండింటికి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన యూఎస్ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అమెరికా నెట్ రన్ రేట్ +0.62గా ఉంది. టీమిండియా ఆడిన ఒక్క మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. అయినప్పటికీ నెట్ రన్ రేట్ +3.06గా చాలా మెరుగ్గా ఉంది. ఒక విజయం సాధించిన కెనడా మూడవ స్థానంలో, ఒక్క పాయింట్ కూడా లేని పాకిస్థాన్, ఐర్లాండ్‌ వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి.

సూపర్ 8 సమీకరణాలు ఇవే!
సూపర్-8 రేసులో పాకిస్థాన్‌కు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నేటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోతే ఆ జట్టు తిప్పలు తప్పేలా లేవు. చెరో రెండు విజయాలతో భారత్, అమెరికా టాప్-2 స్థానాల్లో ఉంటాయి. అప్పుడు పాకిస్థాన్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. పాక్ తన తదుపరి మ్యాచ్‌లు అన్నింటిలోనూ గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో అమెరికా ఫలితాలు కూడా ఆ జట్టు అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ఒకవేళ అనూహ్యంగా గ్రూప్-ఏలో పాకిస్థాన్, ఇండియా, అమెరికా ఈ మూడు జట్లు తలో 6 పాయింట్లు సాధిస్తే మాత్రం నెట్ రన్ రేట్‌ అత్యంత కీలకం కానుంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి.

కాగా అమెరికా తన తదుపరి రెండు మ్యాచ్‌లను భారత్, ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ నెట్ రన్ రేట్ అమెరికా, భారత్ కంటే చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. దీంతో పాక్ ఇకపై అన్ని మ్యాచ్‌లను గెలవడమే కాకుండా మెరుగైన రన్ రేట్‌ను సాధించడం కూడా ఆ జట్టుకు ఎంతో కీలకంగా మారనుంది.
T20 World Cup 2024
India vs Pakistan
Cricket
Super 8 Qualification

More Telugu News