Rajasthan: కోటాలో మరో విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. ఏడాదిలో ఇది 11వ ఘటన!

NEET Aspirant jumps to Death in Rajasthan Kota11th Suicide this year
  • రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మ‌హ‌త్య‌లు 
  • తాజాగా మరో విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
  • మృతురాలు బగీషా తివారీది మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతం
  • నీట్‌-యూజీ ప్రవేశ పరీక్ష కోసం కోటాలో కోచింగ్‌
ప్ర‌వేశ ప‌రీక్ష‌లు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు కొనసాగుతున్నాయి. చ‌దువులో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మరో విద్యార్థిని తనువు చాలించింది. కాగా, ఈ ఘటనతో కలిపి ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది 11వ ఘటన. ఇక గతేడాది ఏకంగా 30 మంది వ‌ర‌కు విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

ఇక తాజా ఘటన వివ‌రాల్లోకి వెళితే..  మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన బగీషా తివారీ (18) అనే యువ‌తి తన తల్లి, సోదరుడితో కలిసి కోటాలోని జవహర్‌ నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (యూజీ) కు సిద్ధమవుతున్న ఆమె కోటాలో కోచింగ్‌ తీసుకుంటోంది. అయితే, ఆమె మంగళవారం నీట్‌-యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత బుధవారం సాయంత్రం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడింది. తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం మహారావ్‌ భీమ్‌ సింగ్‌ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి మృతికిగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan
Kota
NEET
Student
Suicide

More Telugu News