DK Shivakumar: మా నేతలతో చర్చలు జరుపుతున్నాం.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: డీకే శివకుమార్ కీలక వ్యాఖ్య

Our leaders are holding meetings anything can happen in politics shivakumar
  • పార్లమెంటులో బీజేపీ నిరాశాజనక ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం స్పందన
  • బీజేపీ తనంతట తానుగా మెజారిటీ సాధించలేకపోయిందని వ్యాఖ్య
  • తమ నేతలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఎప్పుడు ఏమైనా జరగొచ్చని వ్యాఖ్య
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనక ఫలితాలు నమోదు చేయడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తమ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు, భారత రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు’’ అని అన్నారు. 

మంగళవారం మీడియా సమావేశంలో శివకుమార్ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘బీజేపీ తనంతట తానుగా మెజారిటీ సాధించడంలో విఫలమైంది. ప్రజలు ఇచ్చిన తీర్పును వారు అంగీకరించాలి. మహారాష్ట్రలో పార్టీలను చీల్చే రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. భావోద్వేగ రాజకీయాలను తిప్పికొట్టారు. 400 సీట్లను సాధిస్తామన్న బీజేపీ చాలా వెనకబడింది. మోదీ పాప్యులారిటీ హిందీ బెల్ట్ లో కూడా తగ్గిందని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి. తనకు మెజారిటీ రాలేదన్న విషయాన్ని బీజేపీ అంగీకరించాలి. గత ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న పార్టీ ఈసారి 240 సీట్లకే పరిమితమైంది, ఇక బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడక తప్పదు’’

‘‘కాంగ్రెస్ పార్టీ 100 మార్కును సమీపించింది. మా పార్టీపై ప్రజలకు విశ్వాసముంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, మల్లికార్జున ఖర్గే నిరంతర శ్రమ కారణంగా కాంగ్రెస్ పునరుత్తేజితమైంది. ప్రియాంక గాంధీ పాత్ర కూడా కీలకమే. కర్ణాటక ప్రజలు మాకు పలు సీట్లల్లో విజయం చేకూర్చారు. మా సీట్ల సంఖ్య 1 నుంచి 9కి చేరింది. అయితే, మేము 14 సీట్లు వస్తాయని భావించాము’’ అని అన్నారు. ప్రజాకర్షక గ్యారెంటీ పథకాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కిట్టూర్ కర్ణాటక, బెంగళూరులో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. 

‘‘ఓల్డ్ మైసూరు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే వెనకబడింది. కానీ సుదీర్ఘకాలంగా అక్కడ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఎస్ఎమ్ కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇదే తీరు కనిపించింది. చూస్తుంటే.. కర్ణాటకలో రాజకీయాల తీరు ఇలాగే ఉంటుందని అనిపిస్తోంది’’ అని డీకే శివకుమార్ అన్నారు.
DK Shivakumar
Congress
BJP
Rahul Gandhi
Mallikarjun Kharge
Karnataka

More Telugu News