Chandrababu: ఈ కష్టం, ఈ శ్రమ మరొక్క 24 గంటలు కొనసాగించండి... కూటమి కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu held teleconference with alliance counting agents
  • రాష్ట్రంలో రేపు ఓట్ల లెక్కింపు
  • కూటమి పార్టీల ఏజెంట్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • ప్రజలు ఐదేళ్లపాటు పడిన కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడబోతోందని వెల్లడి
  • కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన
  • ప్రతి ఓటూ కీలకమేనన్న విషయం గుర్తించాలని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కూటమి పార్టీల ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఓట్ల లెక్కింపు వేళ మూడు పార్టీల ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రజలు ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడబోతోందని అన్నారు. 

"ఇప్పటివరకు ఎంతో కష్టపడ్డారు.... ఈ కష్టాన్ని, శ్రమను వచ్చే 24 గంటల పాటూ కొనసాగించాలి. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీం కోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు. 

ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ కౌంటింగ్ లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంది. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు... నిబంధనలు పాటించేలా పట్టుబట్టాలి. 

కౌంటింగ్ ఏజంట్లు ఎలా వ్యవహరించాలో ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ఏజెంట్లు నిర్దేశిత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు... తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దు. 

కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్ ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను... కౌంటింగ్ లో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలి. అన్ని రౌండ్లు పూర్తయ్యాక పోలైన ఓట్లకు, కౌంటింగ్ లో వచ్చిన ఓట్లలో తేడాలు ఉంటే వీవీప్యాట్ లు లెక్కిస్తారు. 

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కు వెళ్లిన ఏజంట్లకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఆర్వోకు అభ్యంతరం తెలపవచ్చు. ఆర్వోలకు ఇచ్చిన ఫిర్యాదులపై ఆక్నాలెడ్జ్ మెంట్ (రసీదు) తప్పకుండా తీసుకోవాలి. మనకున్న అభ్యంతరాలపై నిబంధనలు పాటిస్తూనే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. డిక్లరేషన్ ఫామ్ తప్పుకుండా తీసుకోవాలి. 

అనారోగ్య కారణాలతో ఏజంట్ ఎవరైనా రాలేకపోతే నిబంధనల ప్రకారం కౌంటింగ్ కు ముందే మరొకరిని నియమించుకునే వెసులుబాటు ఉంది. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీ పడొద్దు. ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలి’’ అని చంద్రబాబు నాయుడు సూచించారు.
Chandrababu
Counting Agents
Alliance
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News