Rajasthan High Court: వడగాల్పులను జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది: రాజస్థాన్ హైకోర్టు

Rajasthan High Court has said that there is a need to declare heatwaves and cold waves as national calamities
  • వేడి, చలి గాలులను విపత్తులుగా ప్రకటించాలని అభిప్రాయం
  • వడదెబ్బ తగిలి చనిపోయిన వ్యక్తిపై ఆధారపడ్డ కుటుంబానికి పరిహారం చెల్లించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి సూచన
  • 'హీట్ యాక్షన్ ప్లాన్'ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచన
తీవ్ర వేసవి తాపంతో దేశవాసులు అల్లాడుతున్న నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. వేడిగాలులు, చలి గాలులను జాతీయ విపత్తులుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వడదెబ్బ తగిలి చనిపోయిన ఓ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ఈ అంశాన్ని కోర్టు పరిశీలించింది.

పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులకు సంబంధించిన ఈ అంశాన్ని రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా పరిశీలించింది. రాజస్థాన్ వాతావరణ మార్పుల ప్రాజెక్ట్ కింద రూపొందించిన 'హీట్ యాక్షన్ ప్లాన్'ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు తక్షణమే తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖలు కమిటీలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలంటూ రాజస్థాన్ చీఫ్ సెక్రటరీకి హైకోర్ట్ స్పష్టం చేసింది. వడదెబ్బ కారణంగా మృత్యువాత పడిన వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా ఉత్తర భారత రాష్ట్రాల్లో వేడి గాలులు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్ట్ ఈ విధంగా స్పందించింది.

రోడ్లపై చల్లటి నీటిని చల్లాలి
వేసవి తాపానికి తగ్గట్టుగా పలు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర అధికారులకు రాజస్థాన్ హైకోర్టు కీలక సూచనలు చేసింది. జనసందోహం ఎక్కువగా ఉండే రోడ్లపై నీటిని చల్లాలని సూచించింది. అవసరమైన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద శీతలీకరణ స్థలాలు, షెడ్స్‌ ఏర్పాటు చేయాలని జస్టిస్ అనూప్ కుమార్ దండ్‌ ఆదేశాలు జారీ చేశారు.
Rajasthan High Court
Heatwave
Summer
national calamities

More Telugu News