Gold: ఇంగ్లండ్ నుంచి 100 టన్నుల బంగారాన్ని భారత్ కు తరలించిన ఆర్బీఐ

RBI brings back 100 tonnes of gold to India from England
  • కొన్నాళ్లుగా భారీగా బంగారం కొనుగోళ్లు జరుపుతున్న ఆర్బీఐ
  • బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లో బంగారాన్ని డిపాజిట్ చేసిన భారత్
  • నిల్వ సర్దుబాట్లలో భాగంగా ఆ పసిడిని మళ్లీ స్వదేశానికి తెచ్చిన ఆర్బీఐ
భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) లక్ష కిలోల బంగారాన్ని భారత్ కు తరలించింది. నిల్వ సర్దుబాట్లలో భాగంగా ఈ బంగారాన్ని మళ్లీ భారత్ కు తీసుకువచ్చింది. ఒక్కసారిగా 100 టన్నుల బంగారం తరలించడం అంటే  మాటలు కాదు. అందుకే ఆర్బీఐ ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

గత కొన్నేళ్లుగా ఆర్బీఐ పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉండగా, అందులో 413.8 టన్నులు విదేశాల్లో నిల్వ చేసింది. సాధారణంగా ఆర్బీఐ ముంబయిలోని మింట్ కాంపౌండ్, నాగ్ పూర్ లోని ఓల్డ్  రిజర్వ్ బ్యాంక్ ఆఫీసులో బంగారం నిల్వలు భద్రపరుస్తుంటుంది. 

అయితే ఇటీవల ఆర్బీఐ బంగారం కొనుగోళ్ల జోరు పెంచింది. ఈ నేపథ్యంలో, 100 టన్నుల బంగారాన్ని ఇంగ్లండ్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లో నిల్వ చేసింది. చాలా దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లోనే తమ బంగారం నిల్వలను భద్రపరుస్తుంటాయి. అందుకు కొంత రుసుమును ఇంగ్లండ్ బ్యాంకుకు చెల్లిస్తుంటాయి. తాజాగా ఆ బ్యాంకులోని తన గోల్డ్ డిపాజిట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకున్నందున ఇకపై భారత్ ఆ రుసుమును చెల్లించనక్కర్లేదు.
Gold
RBI
India
Bank Of England

More Telugu News