Rohit Sharma: న్యూయార్క్ క్రికెట్‌ స్టేడియం గురించి రోహిత్ శ‌ర్మ ఏమ‌న్నారంటే..!

Rohit Sharma Shares His Thoughts After Visiting Nassau County International Cricket Stadium in New York
  • జూన్ 2 నుంచి 29 వరకు టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్
  • సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న అమెరికా, వెస్టిండీస్
  • ఈ నేప‌థ్యంలో న్యూయార్క్‌లో ఏకంగా కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం
  • తాజాగా నాసావ్ కౌంటీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియాన్ని సంద‌ర్శించిన రోహిత్‌
  • ఓపెన్ క్రికెట్ స్టేడియం చూడ‌టానికి చాలా అందంగా ఉందంటూ కితాబు
2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఏకంగా కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. నాసావ్ కౌంటీలో ఉన్న ఈ స్టేడియాన్ని తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సంద‌ర్శించాడు. ఈ వేదిక‌గానే భార‌త్ శ‌నివారం బంగ్లాదేశ్‌తో త‌న ఏకైక వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది.  

ఇక ఈ మైదానం గురించి హిట్‌మ్యాన్ మాట్లాడుతూ..  "నాసావ్ కౌంటీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం చూడ‌టానికి చాలా అందంగా ఉంది. రాబోయే రోజుల్లో మేము ఈ ఓపెన్ గ్రౌండ్‌లో ఆడ‌బోతున్నాం. మా వార్మ‌ప్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో ఆడతాం. ఈ మ్యాచ్ ద్వారా చాలా వ‌ర‌కు ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై మాకు ఒక అవ‌గాహ‌న వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను" అని రోహిత్ చెప్పుకొచ్చాడు. 

ఈ సంద‌ర్భంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీతో హిట్‌మ్యాన్ ఫొటోల‌కు కూడా పోజిచ్చాడు. కాగా, న్యూయార్క్ క్రికెట్ స్టేడియాన్ని సంద‌ర్శించిన రోహిత్‌ శ‌ర్మ‌ తాలూకు వీడియోను ఐసీసీ త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అవుతోంది. 

ఇదిలా ఉంటే.. జూన్ 2వ తేదీ నుంచి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు తెరలేవ‌నుంది. జూన్ 29 వ‌ర‌కు మొత్తం 55 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీలో ఏకంగా 20 జ‌ట్లు పోటీ ప‌డుతుండ‌డం విశేషం. నాలుగు గ్రూపులుగా ఈ 20 జ‌ట్లు బ‌రిలోకి దిగ‌నున్నాయి. రోహిత్ సారథ్యంలో టీమిండియా త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తారీఖున ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఆ త‌ర్వాత జూన్ 9న దాయాదుల (భార‌త్‌, పాక్‌) పోరు ఉండ‌నుంది. 

ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే  12న అమెరికాతో ఆడ‌నుంది. ఈ 3 మ్యాచులు కూడా నాసావ్ కౌంటీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం (న్యూయార్క్‌) లోనే జ‌రుగుతాయి. ఇక భార‌త్ త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌ను 15న కెన‌డాతో ఫ్లోరిడా వేదిక‌గా ఆడ‌నుంది.
Rohit Sharma
Team India
T20 World Cup 2024
Nassau County International Cricket Stadium
New York
Cricket
Sports News

More Telugu News