Air India Flight Delay: విమానంలో ఏసీ లేక 8 గంటల పాటు ప్రయాణికుల నరకయాతన

Air India Flight 8 Hours Late People Fainted With No AC Say Passengers
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానంలో ఘటన 
  • శాన్‌ఫ్రాన్‌సిస్కో వెళ్లాల్సిన విమానం టేకాఫ్‌లో జాప్యం
  • 8 గంటల పాటు ఏసీ లేకుండా విమానంలోనే ఉండిపోయిన ప్రయాణికులు
  • నెట్టింట మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదు, క్షమాపణలు చెప్పిన ఏఐ
విమానం బయలుదేరడంలో జాప్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉండిపోయిన వారు ఏసీ కూడా లేక నరకయాతన అనుభవించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన వెలుగు చూసింది. తమ ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఓ ప్రయాణికురాలు నెట్టింట పోస్టు పెట్టారు. 

గురువారం ఉదయం 11 గంటలకు  శాన్‌ఫ్రాన్‌సిస్కోకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం 20 గంటల ఆలస్యంగా బయలుదేరిందన్నారు. తమను విమానంలోనే కూర్చునేలా చేశారని వాపోయారు. కనీసం ఏసీ కూడా లేకపోవడంతో ఎనిమిది గంటల పాటు నరకం కనిపించిందన్నారు. ఉక్కపోత వేడి తట్టుకోలేక కొందరు సొమ్మసిల్లిపోవడంతో తమను బయటకు పంపించారని చెప్పారు. 

ఎయిర్ ఇండియా పనితీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె పౌర విమానయాన శాఖమంత్రిని తన పోస్టులో ట్యాగ్ చేశారు. ఎయిర్ ఇండియా విషయంలో ప్రైవేటీకరణ దారుణంగా విఫలమైందని అన్నారు. ప్రయాణికులను ఇన్ని ఇబ్బందులకు గురి చేయడం అమానవీయమని వ్యాఖ్యానించారు. 

కాగా, ప్రయాణికుల ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా స్పందించింది. వారికి క్షమాపణలు చెప్పింది. ప్యాసెంజర్లకు కావాల్సిన సహాయసహకారాలు అందిస్తున్నామని పేర్కొంది. ఢిల్లీలో ప్రస్తుతం తీవ్ర వడగాలులు వీస్తున్న విషయం తెలిసిందే. బుధవారం అక్కడ ఉష్ణోగ్రత 52.9 డిగ్రీలను తాకింది. రాజస్థాన్ నుంచి వేడి గాలులు వీస్తుండటంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Air India Flight Delay
New Delhi Airport
Heat Wave

More Telugu News