Postal Ballots: పోస్టల్ బ్యాలెట్ పై సీఈవో ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకున్నట్టు హైకోర్టుకు తెలిపిన ఈసీ!

EC said to high court memo on postal ballots withdrew
  • పోస్టల్ బ్యాలెట్ అంశంపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ
  • ఫారం 13ఏపై అటెస్టేషన్ అధికారి సీల్ లేకపోయినా ఫర్వాలేదన్న సీఈవో
  • ఇటీవల మెమో జారీ
  • హోదాను చేతిరాతతోనైనా రాసి ఉండాలని గతంలో ఈసీ చెప్పిందన్న వైసీపీ
  • హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ
పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి సీల్ లేకపోయినా ఫర్వాలేదంటూ ఏపీ సీఈవో గతంలో ఇచ్చిన మెమోకు వ్యతిరేకంగా వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఆ పార్టీ ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం వాదనలు విన్నది. 

ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ అంశంలో గతంలో ఏపీ సీఈవో ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకున్నట్టు ఈసీ నేడు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది. 

అయితే, పోస్టల్ బ్యాలెట్లపై తాజా మార్గదర్శకాలతో ఇవాళ మరో మెమో ఇవ్వడంపైనా వైసీపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం చేసినట్టు తెలుస్తోంది. 

పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం(13ఏ)పై అటెస్టింగ్ అధికారి సంతకం చేసి... స్టాంప్ వేయకపోయినా ఫర్వాలేదని, అయితే తన హోదాను చేతిరాతతో రాయాలని... అలాంటి పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని గతేడాది ఈసీ పేర్కొంది. 

కానీ, ఇటీవల ఏపీ సీఈవో జారీ చేసిన మెమోలో... పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలు... సీల్ లేకపోయినా ఫర్వాలేదు, హోదాను చేతిరాతతో రాయకపోయినా ఫర్వాలేదు అనే విధంగా మార్గదర్శకాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

దాంతో... ఈసీ నిబంధనలు ఒకలా ఉంటే, ఏపీ సీఈవో మెమో మరోలా ఉందంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడీ మెమోను వెనక్కి తీసుకుంటున్నట్టు ఈసీ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో, జూన్ 4న కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్లను ఏ విధంగా లెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Postal Ballots
Memo
EC
AP High Court
YSRCP
Andhra Pradesh

More Telugu News