Rahul Gandhi: మోదీ మరోసారి ప్రధాని కాబోరు... ఇది నా గ్యారెంటీ: రాహుల్ గాంధీ

ED will ask Narendra Modi about Adani says rahul gandhi
  • మోదీ తనను తాను నిజమైన దేశభక్తుడిగా ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా
  • సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు తనను భగవంతుడు పంపించాడని చెబుతున్నారని విమర్శ
  • ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నిపథ్‌ను తొలగిస్తామన్న రాహుల్ గాంధీ
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోరని... ఇది తన గ్యారెంటీ అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లో ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీ తనను తాను నిజమైన దేశభక్తుడిగా ప్రకటించుకుంటారని... కానీ అగ్నిపథ్ పథకంతో జవాన్లను అవమానించారని విమర్శించారు.

సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ప్రధాని మోదీ తనను దేశం కోసం భగవంతుడు పంపించాడని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. తానొక నిజమైన దేశభక్తుడినని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే ఆయన మరోసారి ప్రధాని కావడం కష్టమే అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కాషాయ పార్టీ కుట్రలను తాము తిప్పికొడతామని పేర్కొన్నారు. ఇండియా కూటమికి ఆదరణ లభిస్తోందని... విజయం ఖాయమన్నారు.

ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నిపథ్‌ను తొలగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నెల నెలా ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలో రూ.8500 జమ చేస్తామన్నారు.

ఎన్నికల తర్వాత బీజేపీ ఓడిపోతుందని... అప్పుడు మోదీని ఈడీ ప్రశ్నించడం ఖాయమన్నారు. అదానీ గురించి ఈడీ అడిగితే... 'తనకు తెలియదు... దేవుడు చెప్పాడు' అని మోదీ అంటారని ఎద్దేవా చేశారు. మోదీ సుదీర్ఘ ప్రసంగాలు చేస్తారని... ప్రజలను విడదీసే ప్రయత్నాలు చేస్తారని ఆరోపించారు. కానీ దేశంలోని యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. విభజన రాజకీయాలు చేయకుండా... నిరుద్యోగిత వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
Rahul Gandhi
Congress
Bihar
Lok Sabha Polls

More Telugu News