T20 World Cup 2024: అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో అమెరికా బయలుదేరిన కెప్టెన్ రోహిత్ శర్మ

first batch of India players left for the United States on Saturday to participate in T20 World Cup 2024
  • శనివారం అమెరికా బయలుదేరిన మొదటి బ్యాచ్ ఆటగాళ్లు
  • పలువురు ఆటగాళ్లను వెంటబెట్టుకొని వెళ్లిన కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రావిడ్
  • జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్ 2024
  • సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న అమెరికా, వెస్టిండీస్
టీ20 వరల్డ్ కప్-2024లో పాల్గొనేందుకు భారత ఆటగాళ్ల మొదటి బ్యాచ్ అమెరికా బయలుదేరింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు అందుబాటులో ఉన్న పలువురు ఆటగాళ్లు శనివారం ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా బయలుదేరారు. కెప్టెన్, కోచ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఉన్నారు. ఇక స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీతో సహా ఇతర ఆటగాళ్ల బృందం త్వరలోనే అమెరికా వెళ్లి జట్టుతో కలవనుంది.

కాగా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కానుంది. డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా అమెరికా, కెనడా మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. అదే రోజున భారత్ తన ఏకైక వార్మప్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో రోహిత్ శర్మ సేన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక జూన్ 9న అసలు సిసలైన క్రికెట్ మజాను అందించే హై-వోల్టేజ్ మ్యాచ్‌ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో టీమిండియా తలపడనుంది.

వరల్డ్ కప్ గ్రూప్-ఏలో భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌, సహ ఆతిథ్య దేశంగా ఉన్న అమెరికా, కెనడా, ఐర్లాండ్‌ ఉన్నాయి. ఇక భారత్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. చోటు దక్కించుకున్న మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ కూడా జట్టుతో పాటు ఉండనున్నారు.
T20 World Cup 2024
Team India
Rohit Sharma
Rahul Dravid
Cricket

More Telugu News