Mexico: మెక్సికోలో భారీ గాలులకు కూలిన స్టేజ్.. ఐదుగురి మృతి.. ఇదిగో వీడియో

Stage Collapses At Mexico Presidential Candidates Rally
  • మరో 5‌‌0 మందికి గాయాలు
  • మెక్సికో ఎన్నికల ప్రచార సభలో దుర్ఘటన
  • స్టేజ్ పైనే ఉన్నా సురక్షితంగా బయటపడ్డ అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్
మెక్సికోలో ఓ పార్టీ అధ్యక్ష అభ్యర్థి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. శాన్ పెడ్రో గార్జా గార్షియా పట్టణంలో బుధవారం సిటిజన్స్ మూవ్ మెంట్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గాలి దుమారం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఈదురు గాలుల తీవ్రతకు స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. భారీ లైట్ సెట్టింగ్ లన్నీ కింద ఉన్న వారిపై పడిపోయాయి. దీంతో సభకు వచ్చిన వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయని న్యూవో లియోన్ ప్రాంత గవర్నర్ శామ్యూల్ గార్షియా తెలిపారు.

ప్రమాద సమయంలో స్థానిక మీడియా సభను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ప్రమాదవార్త అందిన వెంటనే వైద్య బృందాలు, సైనిక దళాలు రంగంలోకి దిగాయి. చెల్లాచెదురుగా మారిన ఆ ప్రాంతం నుంచి మృతదేహాలను వెలికితీశాయి. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించాయి.

అయితే సభా వేదికపై ఉన్న సిటిజెన్స్ మూవ్ మెంట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్ అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు. తన క్షేమ సమాచారాన్ని ‘ఎక్స్’ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో మిగిలిన ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు.
Mexico
Stage
Collapse
Gusty Winds
Election Campaign

More Telugu News