Indian Institute of Technology: ఐఐటీల్లో చదివినా 8,100 మందికి నో జాబ్స్!

Job Crisis At IITs 38 percent Students Unplaced Amid Rising Unemployment
  • ఈ ఏడాది దేశంలోని 23 ఐఐటీలలో 38 శాతం మందికి లభించని క్యాంపస్ ప్లేస్ మెంట్లు
  • సమాచార హక్కు చట్టం కింద సేకరించిన గణాంకాల్లో వెల్లడి
  • పాత 9 ఐఐటీల్లో అధికంగా నిరుద్యోగ సమస్య
దేశంలో ఇంజనీరింగ్ చదువులకు అత్యుత్తమ విద్యాసంస్థలుగా పేరుగాంచిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది! దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు ప్లేస్ మెంట్ల సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీలలో కలిపి 8,100 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదు. 2024లో ప్లేస్ మెంట్ల కోసం 21,500 మంది ఐఐటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 13,410 మందికి ఉద్యోగాలు లభించాయి. మిగిలిన 38 శాతం (8,100) మంది నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ధీరజ్ సింగ్ అనే ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, కన్సల్టెంట్ ఈ గణాంకాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సేకరించాడు.

2022లో 3,400 మంది (19 శాతం) ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఐఐటీలలో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరగడం గమనార్హం. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న 9 ఐఐటీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పాత 9 ఐఐటీలలో కలిపి 16,400 మంది ప్లేస్ మెంట్ల కోసం ఈ ఏడాది దరఖాస్తు చేసుకోగా వారిలో ఇంకా 6,050 మంది (37 శాతం) ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన 14 ఐఐటీలలో క్యాంపస్ ప్లేస్ మెంట్ల కోసం రిజిస్టర్ చేసుకున్న 5,100 మంది విద్యార్థుల్లో 2,040 మందిని (40 శాతం) కంపెనీలేవీ తీసుకోలేదు.

ఇందుకు సంబంధించిన వివరాలను ధీరజ్ సింగ్ తన లింక్డ్ ఇన్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘గతేడాది ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన 33 శాతం మంది విద్యార్థులకు ప్లేస్ మెంట్లు లభించలేదు. ఐఐటీ ఢిల్లీలో గత రెండేళ్లలో 600 మందికి జాబ్స్ రాలేదు. గత ఐదేళ్లలో ఐఐటీ ఢిల్లీలో 22 శాతం మందికి ఉద్యోగాలు రాలేదు. వారిలో 40 శాతం మంది స్టూడెంట్స్ కు 2024లోనూ ఉద్యోగాలు లభించలేదు. ఉద్యోగాలు రాని విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారు’ అని ధీరజ్ పేర్కొన్నాడు. అలాగే 61 శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదని చెప్పాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరుగురు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించాడు. అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు కూడా ఉద్యోగాలు లభించకపోవడం దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోందని పేర్కొన్నాడు.

https://www.linkedin.com/embed/feed/update/urn:li:share:7198308810824822784
Indian Institute of Technology
23 IITs
Job Crisis
Low Placements
RTI act

More Telugu News