Xiaomi: మార్కెట్‌ను షేక్ చేయడమే లక్ష్యం.. నయా స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు షావోమీ రెడీ!

Xiaomi Set to Launch New Smartphone In Inida In Rs 50000 Segment
  • ప్రస్తుతం ఎకానమీగా మారిపోయిన రూ. 50 వేల సెగ్మెంట్
  • ఈ సెగ్మెంట్‌లో అరకొరగా ఫోన్లు
  • గ్యాప్‌ను భర్తీ చేసేందుకు రెడీ అయిన షావోమీ
  • వచ్చేస్తున్నట్టు చెప్పిన షావోమీ ఇండియా హెడ్
  • దశాబ్దం క్రితంతో పోలిస్తే వినియోగదారుల మైండ్‌సెట్ మారిందన్న అనూజ్‌శర్మ
చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ మరోమారు భారత మార్కెట్లను దున్నేయాలని భావిస్తోంది. ఈ ఏడాది మొదట్లో 14 సిరీస్‌ను లాంచ్ చేసిన సంస్థ ఇప్పుడు రూ. 50 వేల సెగ్మెంట్‌లో మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా రెడ్‌మీ నోట్ 13 ప్రొ ప్లస్ 5జీ (రూ. 30,999, 8+256 జీబీ), ఫ్లాగ్‌షిప్ ఫోన్ షావోమీ 14 (రూ.69,999) మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేసేందుకు రూ. 50 వేల ధరతో మరో ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ రూ. 50వేల సెగ్మెంట్‌లో ఓ సరికొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు షావోమీ ఇండియా సీఈవో అనూజ్‌శర్మ తెలిపారు. 

2014-15లో వినియోగదారులు రూ. 9,999 ఫోన్ కోసం వెతికేవారని, అప్పుడదే ఎకానమీ అని పేర్కొన్నారు. దశాబ్దం తర్వాత ఇప్పుడు వినియోగదారుల మైండ్‌సెట్ మారిందని, రూ. 50 వేల సెగ్మెంట్ అనేది ప్రస్తుతం ఎకానమీ అయిపోయిందని వివరించారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో గ్యాప్ చాలానే ఉంది. రూ. 50 వేల ధరలో అతి కొద్ది ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఐక్యూ నుంచి ఓ ఫోన్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ కూడా 11ఆర్, 12ఆర్‌తో విజయాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత వినియోగదారులు ముఖం చాటేశారు. యాపిల్, శాంసంగ్ వంటి ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ అవి సామాన్య వినియోగదారుల దరికి చేరుకోలేకపోతున్నాయి.

యాపిల్ ఐఫోన్ 13 ధర రూ. 45 వేలే అయినప్పటికీ ఐఫోన్‌ను వాడాలని అనుకుంటున్న వారు మాత్రమే దానివైపు చూస్తున్నారు. ఇక, శాంసంగ్ ఇటీవల రూ. 45 వేల ధరతో గెలాక్సీ ఏ55ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న షావోమీ రూ. 50 వేల రేంజ్‌లో మార్కెట్‌ను దున్నేయాలని భావిస్తోంది.
Xiaomi
Xiaomi India
Redmi Note
Anuj Sharma
China Mobile Maker
Smart Phone

More Telugu News