Retired Army Dog: ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో రిటైర్డ్ సైనిక శునకం ప్రయాణం.. నెటిజన్ల ఫిదా!

Retired Army Dog FirstClass Journey to Retirement Home Wins Hearts Online
  • తొమ్మిదేళ్లపాటు సైన్యంలో సేవలు అందించిన మెరూ అనే లాబ్రడార్ రిట్రీవర్ జాతి కుక్క
  • దీంతో దాన్ని సగౌరవంగా రైటైర్మెంట్ కేంద్రానికి తరలించాలని నిర్ణయించిన సైన్యం
  • యూపీలోని మీరట్ లో ఉన్న ఆ కేంద్రం వరకు రైల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో తరలింపు
మెరూ అనే తొమ్మిదేళ్ల సైనిక శునకం ప్రస్తుతం ఆన్ లైన్ సెన్సేషన్ గా మారిపోయింది. రిటైరైన సందర్భంగా సైన్యం దాన్ని సగౌరవంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించడం నెటిజన్ల మనసు గెలుచుకుంది. రైల్లోని ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో కుక్క ప్రయాణించిన ఫొటోలు నెట్టంట వైరల్ గా మారాయి. అందులో మెరూ తన బెర్త్ పై దర్జాగా దుప్పటి కప్పుకొని కనిపించింది. ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా కునుకు తీసింది.

22 ఆర్మీ డాగ్ యూనిట్ లో ట్రాకర్ డాగ్ గా లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన మెరూ పనిచేసింది. ప్రాణాంతక పేలుడు పదార్థాల జాడ పసిగట్టడం, ఉగ్రవాదుల కాలిబాట ప్రకారం వారు ఎక్కడ దాక్కున్నారో ఆచూకీ కనిపెట్టడం లాంటి విధులు నిర్వహించింది. తొమ్మిదేళ్ల సర్వీసు అనంతరం తాజాగా రిటైరైంది. మీరట్ లోని సైనిక శునకాల రిటైర్మెంట్ కేంద్రంలో శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపనుంది.

దేశంలో ఉగ్రదాడులను నిరోధించేందుకు తన వంతు ప్రయత్నం చేసిన మెరూను గౌరవప్రదంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించాలని సైన్యం నిర్ణయించింది. సైనిక శునకాలు రిటైరయ్యాక వాటి శిక్షకులతో కలసి ఫస్ట్ క్లాస్ ఏసీ రైళ్లలో ప్రయాణించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది. దీంతో యూపీలోని మీరట్ లో ఉన్న ఆ కేంద్రానికి మెరూను తరలించేందుకు సైన్యం దాని పేరుతో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెర్త్ బుక్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అశోక్ బిజల్వాన్ అనే రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ శునకం ఎక్కడ రైలు ఎక్కిందో మాత్రం వెల్లడించలేదు.

ఈ ఫొటోలను చూసిన నెటిజన్లంతా కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెరూకు సెల్యూట్ చేస్తున్నారు. దాన్ని పెంచుకొనేందుకు చాలా మంది ఉత్సాహం చూపించారు. సైనిక సేవలు అందించే శునకాలను దేశం ఎంతగా గౌరవిస్తుందో ఈ నిర్ణయం తెలియజేస్తోందని అంటున్నారు. ప్రయాణికులు తమ వెంట కుక్కలను తీసుకెళ్లే అవకాశం ఏసీ ఫస్ట్ క్లాస్ లో మాత్రమే ఉందని.. సాధారణంగా అయితే వాటిని బోనులో పెట్టి బ్రేక్ వ్యాన్ లో తరలిస్తారని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
Retired Army Dog
Indian Army
Retirement Home
Meerut
First Class AC Compartment
Travel

More Telugu News