Rahul Tripati: కన్నీళ్లు పెట్టిన సన్‌రైజర్స్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి

Most Heart Breaking Photo Of The Day is Rahul Tripati Crying
  • అనూహ్య రీతిలో రనౌట్ అయిన సన్‌రైజర్స్ బ్యాటర్
  • మంచి ఫామ్‌లో ఉండి రనౌట్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన రాహుల్ త్రిపాఠి
  • పెవిలియన్‌కు వెళ్తూ కన్నీళ్లు పెట్టిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన త్రిపాఠి ఫొటో
అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి కంటితడి పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది డే’ క్యాప్షన్‌తో క్రికెట్ ఫ్యాన్స్ ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు. 

ఇంతకీ ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఏంటంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడిన తాను అనూహ్య రీతిలో రనౌట్ అవడాన్ని రాహుల్ త్రిపాఠి జీర్ణించుకోలేకపోయాడు. భారమైన హృదయంతో మైదానాన్ని వీడిన త్రిపాఠి పెవిలియన్‌కు వెళ్లేదారిలో మెట్లపై కూర్చొని ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీంతో ‘మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది డే’ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమైనప్పటికీ రాహుల్ త్రిపాఠి రాణించాడు. 35 బంతుల్లో 55 పరుగులు బాదాడు. దీంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే ఓ పరుగు తీసే విషయంలో బ్యాటింగ్ చేసిన అబ్దుల్ సమద్, అవతలి ఎండ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి మధ్య సమన్వయం జరగలేదు. దీంతో అనూహ్య రీతిలో రాహుల్ త్రిపాఠి రనౌట్ కావాల్సి వచ్చింది. ఈ పరిణామంతో సన్‌రైజర్స్ ఆటగాళ్లంతా షాక్‌కు గురయ్యారు.

కాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో 3 కీలకమైన వికెట్లు తీసి హైదరాబాద్‌ను దెబ్బకొట్టిన కోల్‌కతా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Rahul Tripati
Sunrisers Hyderabad
IPL 2024
Cricket
Kolkata Knight Riders

More Telugu News