KKR vs SRH: సన్‌రైజర్స్‌పై విజయంతో చరిత్ర సృష్టించిన కోల్‌కతా

KKR registered the record for quickest chases in IPL playoffs
  • 38 బంతులు మిగిలివుండగా 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కోల్‌కతా
  • నాకౌట్ దశలో అత్యధిక బంతులు మిగిలివుండగా టార్గెట్ ఫినిష్ చేసిన జట్టుగా నిలిచిన అయ్యర్ సేన
  • హైదరాబాద్‌పై గెలిచి ఫైనల్ చేరిన నైట్ రైడర్స్
ఐపీఎల్-2024లో భాగంగా మంగళవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. 160 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. అలవోకగా విజయాన్ని అందుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకుంది.

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగంగా లక్ష్య ఛేదన చేసిన జట్టుగా కోల్‌కతా రికార్డు నెలకొల్పింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మరో 38 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా మ్యాచ్‌ను ముగించింది. ఇంత పెద్ద సంఖ్యలో బంతులు మిగిలివుండగా గతంలో ఏ జట్టూ ప్లే ఆఫ్స్‌లో ఈ స్థాయి విజయాన్ని సాధించలేదు. దీంతో చారిత్రాత్మకమైన రికార్డు కోల్‌కతా సొంతమైంది. ఐపీఎల్ 2017 ఎడిషన్‌లో క్వాలిఫయర్-2లో కోల్‌కతాపై 33 బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలిచి రికార్డు సృష్టించగా అది ఇప్పుడు బ్రేక్ అయ్యింది.

నాకౌట్‌‌లో అత్యధిక బాల్స్ మిగిలివుండగా విజయాలు..
1. సన్‌రైజర్స్‌పై కోల్‌కతా గెలుపు(2024) - 38 బంతులు మిగిలివుండగా
2. కోల్‌కతాపై ముంబై (2027) - 33 బంతులు మిగిలివుండగా
3. కింగ్ ఏలెవన్ పంజాబ్‌పై చెన్నై - 31 బంతులు మిగిలివుండగా

కాగా 160 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ జోడీ 97 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సిక్సర్లు, ఫోర్లతో ఇద్దరూ చెలరేగారు. దీంతో 13.4 ఓవర్లలోనే 8 వికెట్లు మిగిలివుండగా కోల్‌కతా విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా నాలుగవసారి ఫైనల్ చేరింది. అంతకుముందు 2012, 2014, 2021 ఎడిషన్లలో కోల్‌కతా ఫైనల్ చేరింది. రాజస్థాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు అహ్మదాబాద్‌లో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో హైదరాబాద్ జట్టు 24న తలపడుతుంది. అందులో కనుక విజయం సాధిస్తే ఫైనల్‌లో మళ్లీ కోల్‌కతాను ఢీకొంటుంది.
KKR vs SRH
Sunrisers Hyderabad
Kolkata Knight Riders
IPL 2024
IPL Play Offs

More Telugu News