Mallikarjun Kharge: రాహుల్ గాంధీకి అదానీ, అంబానీ డబ్బులిస్తే మీరేం చేస్తున్నారు?: మల్లికార్జున ఖర్గే ప్రశ్న

Kharge questions about Adani and Ambani money to rahul gandhi
  • కాంగ్రెస్ పార్టీని చూసి మోదీ, అమిత్ షా భయపడుతున్నారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పోటీనే కాదని పదేపదే విమర్శలు చేస్తున్నారని మండిపాటు
  • ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణలో కొన్ని హామీలు అమలు చేయలేకపోయామని వెల్లడి
రాహుల్ గాంధీకి అదానీ, అంబానీలు డబ్బులు ఇచ్చారని ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని, అదే నిజమైతే సీబీఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని చూసి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తమకు అసలు పోటీనే కాదని కొంతమంది పదేపదే విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నల్లధనం వెలికితీస్తానని ప్రగల్భాలు పలికి దానిని నెరవేర్చలేదన్నారు. నల్లధనం ప్రయోజనాలను తన మిత్రులకే అందించారని విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేశామన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్నింటిని అమలు చేయలేకపోయినట్లు చెప్పారు. రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని ఓట్లు అడగడం లేదని, తమ పార్టీపై నిందలు మోపడం ద్వారా ఓట్లు అడుగుతోందని విమర్శించారు. అధిక విడతల్లో ఎన్నికల నిర్వహణ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని విమర్శించారు. అయితే ఎన్నికల కమిషన్ విధానాల మేరకు అందరూ నడుచుకోవాల్సిందే అన్నారు.
Mallikarjun Kharge
Rahul Gandhi
Congress
BJP
Lok Sabha Polls

More Telugu News