Supreme Court: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం

Supreme court orders to AP Government on illegal sand mining
  • అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని గతనెల 29న సుప్రీం కోర్టు ఆదేశం
  • అయినా ఇష్టారాజ్యంగా తవ్వకాలు కొనసాగించారని ఆధారాలతో కోర్టుకు వెళ్లిన ఎన్జీవో నేత 
  • అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపివేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి తనిఖీలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తర్వాత కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారని, దీనికి సంబంధించి ఇసుక రవాణ చేస్తున్న వాహనాలతో పాటు ఫొటోలు, తేదీ, సమయంతో కూడిన ఆధారాలను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నాగేంద్ర కుమార్ సుప్రీం కోర్టు ముందు ఉంచారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడంతో పాటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ తవ్వకాలు నిలిపివేశారా లేదా అన్నది తనిఖీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. విచారణ సందర్భంగా అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కేవలం కాగితాలపైనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించవని న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా వ్యాఖ్యానించారు.
Supreme Court
Andhra Pradesh
sand mining

More Telugu News