Sue Restaurant: వెజ్‌ శాండ్‌విచ్ ఆర్డరిస్తే నాన్‌ వెజ్ డెలివరీ.. రూ.50 లక్షల పరిహారానికి మహిళ డిమాండ్

Woman Orders Paneer Sandwich Gets Chicken Instead Sues For 50 Lakhs
  • ఆహ్మదాబాద్‌లో మహిళకు షాకింగ్ అనుభవం
  • మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే రెస్టారెంట్‌పై రూ.5 వేల జరిమానా
  • ఇది సరిపోదన్న మహిళ, రూ.50 లక్షల పరిహారం కోరుతూ కేసు వేసేందుకు సిద్ధం
  • తమ హక్కుల గురించి తెలియని వారి కోసం పోరాడుతున్నానని మహిళ వివరణ 
ఫుడ్‌ డెలివరీ యాప్‌లో వెజ్ శాండ్‌విచ్ ఆర్డర్ చేసిన మహిళ చివరకు నాన్ వెజ్ శాండ్‌విచ్ డెలివరీ కావడంతో అగ్గిమీద గుగ్గిలమవుతోంది. చికెన్ శాండ్‌విచ్ సరఫరా చేసిన రెస్టారెంట్‌పై రూ.50 లక్షల పరిహారం కోరుతూ కేసు వేసేందుకు రెడీ అయ్యింది. అహ్మదాబాద్‌కు చెందిన నిరాలీ మే 3న పనీర్ ‘పిక్‌ అప్ మీల్స్ బై టెర్రా’ నుంచి పనీర్ టిక్కా శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది. ఇంటికి ఫుడ్ డెలివరీ అయ్యాక రెండు ముక్కలు తిన్న ఆమెకు డౌట్ వచ్చింది. శాండ్‌విచ్ సాధారణం కంటే కాస్తంత గట్టిగా అనిపించడంతో చూస్తే అది చికెన్ శాండ్‌విచ్ అని తేలింది. దీంతో, మండిపడ్డ మహిళ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, ఆహార శాఖ ఆ రెస్టారెంట్‌కు రూ.5 వేల జరిమానా విధించింది. 

అయితే, విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టని మహిళ రెస్టారెంట్ నుంచి రూ.50 లక్షల పరిహారం కోరుతూ కేసు వేసేందుకు సిద్ధమైంది. ‘‘ఇదో భయానక ఘటన. జరిగింది వెనక్కు తీసుకోలేము. రూ.5 వేల జరిమానా సరిపోదు. నేను వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తా. రూ.50 లక్షల కంటే ఎక్కువ పరిహారాన్ని నేను అడిగుండేదాన్నే. అప్పుడు కూడా నాకు తగిన న్యాయం జరిగి ఉండేది కాదు’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం ఇంతవరకూ స్పందించలేదు. 

మరోవైపు, మహిళ తీరును నెట్టింట కొందరు విమర్శించారు. అయితే, ఆమె మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తమ హక్కులు ఏంటో తెలియని వినియోగదారుల కోసం తానీ పోరాటం చేస్తున్నట్టు నిరాలీ చెప్పుకొచ్చింది.
Sue Restaurant
Non Veg Food Delivery
Rs.50 lakhs Compensation
Viral News

More Telugu News