Vladimir Putin: రికార్డు స్థాయిలో ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన పుతిన్

Putin takes charge as Russian President record fifth term
  • రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న పుతిన్
  • 1999 నుంచి రష్యా పగ్గాలు పుతిన్ చేతిలోనే!
  • పాతికేళ్లుగా క్రెమ్లిన్ లో పుతిన్ హవా
  • పుతిన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బాయ్ కాట్ చేసిన అమెరికా, మరికొన్ని దేశాలు 
రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ కు ఎదురే లేకుండాపోయింది. రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకున్న పుతిన్ ఇవాళ  రికార్డు స్థాయిలో ఐదోసారి రష్యా అధ్యక్షుడి పదవీ ప్రమాణస్వీకారం చేశారు. మాస్కోలోని అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ లో ఈ పదవీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా క్రెమ్లిన్ ను రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. 

పుతిన్ 1999లో రష్యా పగ్గాలు అందుకున్నారు. ఆయన 2030 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగేలా రాజ్యాంగంలో అనుకూల మార్పులు చేసుకున్నారు. 

స్టాలిన్ శకం నుంచి చూస్తే... అత్యధిక కాలం రష్యా పగ్గాలు చేపట్టిన నేతగా పుతిన్ నిలిచిపోతారు. గత 25 ఏళ్లుగా రష్యాలో పుతిన్ నాయకత్వం అప్రతిహతంగా కొనసాగుతోంది. విపక్ష నేతలుగా ఉండాలంటేనే రష్యా రాజకీయ నేతలు హడలిపోయే పరిస్థితి ఉంది. 

ఇవాళ ప్రమాణ స్వీకారం సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, రష్యాకు నాయకత్వం వహించడం ఓ పవిత్ర బాధ్యత అని అభివర్ణించారు. కష్టకాలం ముగిశాక రష్యా బలమైన దేశంగా అవతరిస్తుందని అన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని హుందాగా అధిగమిద్దామని పిలుపునిచ్చారు. 

మనమంతా ఒక్కటే... మనది మహోన్నత దేశం... కలసికట్టుగా మనం అడ్డంకులను అధిగమిద్దాం... సంఘీభావంతో ముందడుగు వేసి విజేతలుగా నిలుద్దాం అని పుతిన్ రష్యన్లను ఉద్దేశించి ప్రసంగించారు. 

ప్రపంచంలోని అత్యధిక దేశాలతో సత్సంబంధాలను రష్యా కాంక్షిస్తోందని, అందుకు ద్వారాలు తెరిచే ఉంటాయని అన్నారు. కాగా, రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అమెరికా, తదితర పాశ్చాత్య దేశాలు బహిష్కరించాయి. ఉక్రెయిన్ పై రష్యా దండెత్తినప్పటి నుంచి అమెరికా, నాటో దేశాలు రష్యాను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తుండడం తెలిసిందే.
Vladimir Putin
President
Kremlin
Russia

More Telugu News