Chandrababu: ఏపీలో ముస్లింలు చంద్రబాబుకు అండగా నిలవాలి: తన్జీమ్-ఈ-ముఫ్తియాన్ పిలుపు

Islamic outfit calls AP Muslims should support Chandrababu this elections
  • హైదరాబాదులో చంద్రబాబును కలిసిన తన్జీమ్ ఈ ముఫ్తియాన్ నేతలు
  • ముస్లింల సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టీకరణ
  • టీడీపీ వస్తేనే ముస్లింలు, ప్రజల భవిష్యత్ కు భరోసా ఉంటుందని వెల్లడి
యూపీలోని దియోబంద్ నగరం కేంద్రంగా పని చేస్తున్న తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) ప్రధాన కార్యదర్శి షేక్ ఉల్ హదీస్ అల్లమా ముఫ్తీ జియా ఉల్లా ఖాన్ ఖాసిమీ, కోశాధికారి అల్లమా ముఫ్తీ ఘుప్రాన్, సంస్థ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఇస్మాయిల్ ఖాసిమీ నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. 

ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి ఖాసిమీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో యావత్ ముస్లిం సమాజం సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర అభివృద్ధి, ముస్లిం సమాజ సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని మర్చిపోలేమన్నారు. 

"రాష్ట్రంలో ఈనెల 13వ తేదీన జరగబోయే ఎన్నికలు మన భవిష్యత్ ను, రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను, భావితరాల భవిష్యత్ ను నిర్దేశిస్తాయి. ముస్లిం యువతకు ఉపాధి లభించాలన్నా, వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా, ముస్లింలతో కూడిన 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి పూర్తి కావాలన్నా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు దేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధులకు ఈ కీలక ఎన్నికల్లో అండగా నిలవాలి. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మైనారిటీలు కృషి చేయాలి. 

అమరావతి రాజధానిగా కొనసాగటం ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. అమరావతి ప్రాంతంలో గుంటూరు తూర్పు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల్లో దాదాపు 9 లక్షల ముస్లింల జనాభా, 750కి పైగా మసీదులు, పలు ఆటోనగర్లు ఉన్నాయి. ఆటోనగర్లలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు ఉండేది ముస్లిం సమాజానికే అన్న సంగతి మనం మర్చిపోకూడదు" అని ఖాసిమీ పేర్కొన్నారు. 

సంస్థ కోశాధికారి అల్లమా ముఫ్తీ ఘుప్రాన్ మాట్లాడుతూ... జగన్ పాలనలో ముస్లింలపై ఒక వైపు కిరాతక దాడులు, మరోవైపు బలవంతపు మతమార్పిడిలు జరగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Chandrababu
Muslims
TDP
Andhra Pradesh
General Elections-2024

More Telugu News