Sunita Williams: సాంకేతిక లోపం.. సునీతా విలియమ్స్ స్పేస్ మిషన్ చివరి నిమిషంలో వాయిదా

Sunita Williams 3rd Mission To Space Called Off Hours Before Liftoff
  • ఈ ఉదయం 8.04 గంటలకు నింగిలోకి వెళ్లాల్సిన బోయింగ్ స్టార్‌‌లైనర్‌ 
  • ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ నామమాత్రంగా ఉండడంతో లాంచింగ్ నిలిపివేత   
  • సునీత పేరున ఇప్పటికే పలు రికార్డులు
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లే మిషన్ వాయిదా పడింది. ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళ్లే బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాలు ఏర్పడడంతో ప్రస్తుతానికి ప్రయోగాన్ని నిలిపివేశారు. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడా కేప్ కెనావెరల్‌లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్‌లైనర్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. 

ఆక్సిన్ రిలీఫ్ వాల్వ్‌లో తేడాలు
ప్రయోగానికి అంతా సిద్దమై, మరో 90 నిమిషాల్లో నింగిలోకి దూసుకెళ్తుందనగా అట్లాస్ వి రాకెట్‌ లాంచింగ్‌ను నిలిపివేశారు. ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ నామమాత్రంగా ఉండడంతోనే ప్రయోగాన్ని రద్దు చేసినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ సురక్షితంగా స్పేస్‌క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చారు. 

అంతరిక్షంలో సునీత రికార్డు.. ఈసారి మరో రికార్డు
సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష ప్రయాణం కానుంది. ఇప్పటికే ఒకసారి అంతరిక్షంలో 322 రోజులు గడిపిన రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. అంతేకాదు, అత్యధిక గంటలు స్పేస్‌వాక్ చేసిన రికార్డు కూడా ఆమె సొంతం. అంతకుముందు ఈ రికార్డు పెగ్గీ విట్సన్ పేరున ఉండేది. సునీత ఈసారి మరో కొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కొత్త స్పేస్ షటిల్‌లో తొలిసారి మరొకరితో కలిసి ప్రయాణించిన తొలి మహిళగా రికార్డులకెక్కబోతున్నారు. 

నాలుగుసార్లు స్పేస్‌వాక్
విలియమ్స్ తొలిసారి 9 డిసెంబర్ 2006లో వాయేజ్ నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి 22 జూన్ 2007 వరకు ఉన్నారు. నాలుగుసార్లు మొత్తంగా 29 గంటల 17 నిమిషాలు స్పేస్‌వాక్ చేసి రికార్డు సృష్టించారు. రెండోసారి జులై 14 2012లో వెళ్లి నవంబర్ 18 వరకు గడిపారు. 59 ఏళ్ల సునీత మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లనుండడంపై మాట్లాడుతూ.. తాను అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటే ఇంటికి తిరిగి వెళ్లినట్టు భావిస్తానని పేర్కొన్నారు. ఈసారి అంతరిక్షంలోకి తనతోపాటు గణేశుడి విగ్రహం తీసుకెళ్లబోతున్నట్టు తెలిపారు. కాగా, నిలిచిపోయిన ఈ ప్రయోగం మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ తేదీలు ప్రకటించాల్సి ఉంది.
Sunita Williams
Space
Astronaut
Boeing Starliner
Kennedy Space Center

More Telugu News