Perni Nani: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు, మీ భూమి వివాదానికి సంబంధం ఏంటి?: పీవీ రమేశ్ ను ప్రశ్నించిన పేర్ని నాని

Perni Nani slams retired IAS PV Ramesh
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు బాధితుడ్ని అయ్యానంటూ మాజీ ఐఏఎస్ రమేశ్ వ్యాఖ్యలు
  • చంద్రబాబు కోసం పీవీ రమేశ్ ఇంత దిగజారాలా? అంటూ పేర్ని నాని వ్యాఖ్యలు 
  • చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు జగన్ పై విషం చిమ్ముతున్నారని విమర్శ  
ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు తాను బాధితుడ్ని అయ్యానంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. పీవీ రమేశ్ పెద్ద చదువులు చదివి, ఐఏఎస్ సాధించిన వ్యక్తి అని, కానీ చంద్రబాబు కోసం ఇంతగా దిగజారడం అసహ్యంగా అనిపిస్తోందని అన్నారు. 

పీవీ రమేశ్ కృష్ణా జిల్లా విన్నకోట గ్రామానికి చెందినవారని, ఆయన తండ్రి సుబ్బారావు మాస్టారు, మరికొందరు కలిసి 70 ఎకరాల భూమి కొని అందులో చెరువు తవ్వి లీజుకు ఇస్తున్నారని పేర్ని నాని వెల్లడించారు. పీవీ రమేశ్ తండ్రి ఏడాది క్రితం మరణించారని తెలిపారు. 

తండ్రి మరణానంతరం పీవీ రమేశ్ ఆ చెరువు భూమి మ్యుటేషన్ కు ప్రయత్నించారని, అయితే, చెరువు కోసం సేకరించిన భూమి అయినప్పటికీ, కొంత వ్యవసాయ భూమి కూడా ఉండడంతో రెవెన్యూ అధికారులు బహిరంగ విచారణ జరిపారని వెల్లడించారు. 

అందరు రైతులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువస్తే, పీవీ రమేశ్ మాత్రం తన వద్ద పనిచేసే వ్యక్తితో జిరాక్స్ కాపీలు పంపించాడని పేర్ని నాని ఆరోపించారు. కానీ అధికారులేమో ఒరిజినల్ పత్రాలు కావాలంటున్నారని, ఆ విధంగా ఆ భూమి వివాదం ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. ఆ చెరువు భూమిలో భాగస్వామిగా ఉన్న గాలంకి నాగేంద్ర అనే వ్యక్తికి, పీవీ రమేశ్ కు మధ్య కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయని పేర్ని నాని వివరించారు. 

అసలు విషయం ఇదీ... మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు, మీ భూమి వివాదానికి ఏమిటి సంబంధం? అని పీవీ రమేశ్ ను పేర్ని నాని ప్రశ్నించారు. అక్కడున్న భూమి విస్తీర్ణం కంటే, పీవీ రమేశ్ అధిక లీజు పొందుతున్నారని స్థానిక రైతులే ఆరోపిస్తున్నారని, దీనికి పీవీ రమేశ్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 

చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్ చేయమంటే ఆ డాన్స్ చేస్తున్నారు... ఐఏఎస్ చదివిన మీరు చంద్రబాబు పక్షాన చేరి పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు సీఎం జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గం అని విమర్శించారు.
Perni Nani
PV Ramesh
Rtd IAS
Land Titling Act
YSRCP
Chandrababu
Andhra Pradesh

More Telugu News