solar storm: సూర్యుడిపై రెండు భారీ సౌర తుపానులు.. వీడియో ఇదిగో

Sun Releases 2 Powerful Solar Storms Earth In Firing Line
  • మే 2, 3 తేదీల్లో సంభవించిన భారీ సోలార్ స్టార్మ్స్
  • ఆస్ట్రేలియా, జపాన్, చైనాలో షార్ట్‌వేవ్ రేడియో తరంగాలపై కాసేపు ప్రభావం
  • నెటిజన్లతో వీడియో పంచుకున్న ఓ శాస్ర్తవేత్త
ప్రస్తుత 11 ఏళ్ల సౌర చక్ర కాలంలో సూర్యుడిపై తాజాగా రెండు భారీ సౌర తుపానులు ఏర్పడ్డాయి. సూర్యుని అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య దిశ మారే క్రమంలో ఇవి సంభవించాయి. 

మే 2న తొలి తుపాను సంభవించగా మే 3న రెండో తుపాను ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను కీత్ స్ట్రాంగ్ అనే శాస్ర్తవేత్త ‘ఎక్స్’ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ఏఆర్ 3663 అనే సన్ స్పాట్ ప్రాంతంలో ఈ రెండు సౌర తుపానులు ఏర్పడ్డట్లు వెల్లడించారు.

ఆ సమయంలో సూర్యునిలోని సన్ స్పాట్ ప్రాంతం భూమికి సరిగ్గా ఎదురుగా ఉందన్నారు. దీనివల్ల ఆస్ట్రేలియా, జపాన్, చైనాలోని చాలా ప్రాంతాల్లో షార్ట్‌వేవ్ రేడియో తరంగాలకు అవరోధం ఏర్పడిందని వివరించారు. తొలి తుపానును ఎక్స్ క్లాస్ ఫ్లేర్ గా, రెండో తుపానును ఎం క్లాస్ విస్ఫోటనంగా వివరించారు. ప్రస్తుత సౌర చక్ర కాలంలో ఎక్స్ క్లాస్ ఫ్లేర్ 11వ అతిపెద్ద సౌర తుపాను అని వెల్లడించారు. సుమారు 25 నిమిషాలపాటు ఇది సంభవించిందన్నారు.

భూమివైపు సౌర తుపానులు వెదజల్లే కరోనల్ మాస్ ఇజెక్షన్ వల్ల పవర్ గ్రిడ్‌లు, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు ప్రమాదం ఉంటుందని space.com వెబ్ సైట్ వెల్లడించింది. అలాగే ఇది వ్యోమగాములను ప్రమాదకరమైన రేడియేషన్‌ కు గురి చేస్తుందని చెప్పింది. ఈ రెండు సౌర తుపానుల్లో ఒక దానితో కరోనల్ మాస్ ఇజెక్షన్ కూడా విడుదలై ఉంటుందని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడ్డట్లు తెలిపింది.
solar storm
sun
earth
scientist
release video

More Telugu News