రాయ్‌బరేలీ నుంచి రాహుల్.. అమేథీ నుంచి ప్రియాంక పోటీ: కాంగ్రెస్ వర్గాలు
- రాయబరేలీ, అమేథీల్లో నామినేషన్ దాఖలుకు మే 20 చివరి తేదీ
- రాయబరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేశ్ ప్రతాప్
- నామినేషన్ పత్రాల దాఖలుకు రాహుల్ వెంట వెళ్లనున్న సోనియా
మరోవైపు, రాయబరేలీ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దినేశ్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ గురువారం ప్రకటించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన సోనియా గాంధీ చేతిలో పరాజయం పొందారు. ఇక గాంధీ కుటుంబ విశ్వాసపాత్రుడు కిషోరీ లాల్ అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో అమేథీ నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు సమర్పించేటప్పుడు సోనియా గాంధీ కూడా వెంట ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అమేథీ నుంచి రాహుల్ గాంధీ వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2019 వరకూ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయనాడ్ ఎంపీగా ఉన్నారు. మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. అయితే, పార్టీ ఆదేశాల అనుసారం తాను నడుచుకుంటానని గతంలోనే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2004 -24 మధ్య రాయ్‌బరేలీకి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆమె 1999లో అమేథీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అమేథీకి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ కూడా ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు.