North Carolina: నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం.. నలుగురు పోలీసుల మృతి!

Four law enforcement officers killed in North Carolina
  • మరో నలుగురు పోలీసులకు గాయాలు.. నిందితుడి కాల్చివేత
  • అక్రమంగా మారణాయుధం కలిగి ఉన్నందుకు అరెస్టు వారంట్ తో వెళ్లిన పోలీసులు
  • దీంతో వారిపై కాల్పులు జరిపిన దుండగుడు.. మరో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ర్టంలో కాల్పుల కలకలం చెలరేగింది.  చార్లోట్ లోని గాల్ వే డ్రైవ్ వద్ద నివసిస్తున్న ఓ  పాత నేరస్తుడు అక్రమంగా మారణాయుధాన్ని కలిగి ఉండటంతో అరెస్టు వారెంట్ జారీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 

ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు దుర్మరణం చెందగా మరో నలుగురు పోలీసులు గాయపడ్డారు. హుటాహుటిన రంగంలోకి దిగిన శ్వాట్ టీంలు ఎదురుకాల్పులు జరిపి ఓ నిందితుడిని మట్టుబెట్టాయి. అలాగే మరో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశాయి. ఈ విషయాన్ని చార్లోట్‌‌–మెక్లెన్ బర్గ్ పోలీసు డిపార్ట్ మెంట్ ‘ఎక్స్’లో వెల్లడించింది.

మృతుల్లో ముగ్గురు యూఎస్ మార్షల్స్ టాస్క్ ఫోర్స్ కు చెందిన వారని చార్లోట్‌‌–మెక్లెన్ బర్గ్ పోలీసు డిపార్ట్ మెంట్ చీఫ్ జానీ జెన్నింగ్స్ తెలిపారు. మరొకరు తమ డిపార్ట్ మెంట్ కు చెందిన వారని చెప్పారు. ‘చార్లోట్ నగరానికి, పోలీసు శాఖకు ఇది అత్యంత విషాదకరమైన రోజు. మన సమాజాన్ని సురక్షితంగా ఉంచేందుకు పనిచేస్తున్న కొందరు హీరోలను విధి నిర్వహణలో భాగంగా కోల్పోయాం’ అని జెన్నింగ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాల్పుల ఘటన గురించి ఉన్నతాధికారులు అధ్యక్షుడు జో బైడెన్ కు  వివరించారు. దీంతో ఆయన నార్త్ కరోలినా గవర్నర్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
North Carolina
USA
firing
Police
Charlotte

More Telugu News