Thummala: ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ కే వుంటుంది: తుమ్మల నాగేశ్వరరావు

Wherever there are Muslims Congress will win says Thummala Nageswara Rao
  • కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని వ్యాఖ్య
  • ముస్లింల త్యాగఫలంతోనే కాంగ్రెస్ ఈ స్థానంలో ఉందన్న తుమ్మల
  • ముస్లింలు ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా 
లోక్ సభ ఎన్నికలకు రెండు వారాల సమయం కూడా లేదు. అన్ని పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. సాధారణంగానే బీజేపీకి హిందూ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ముస్లిం ఓట్లు పడితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్ని పార్టీలు భావిస్తుంటాయి. తాజాగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముస్లింలను ప్రసన్నం చేసుకునేలా వ్యాఖ్యలు చేశారు. 

ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముస్లింలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉన్నారని చెప్పారు. ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ కేనని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని... ఈ పార్టీ ముస్లింలకే సొంతమని చెప్పారు. ముస్లింల అండతో ఈ లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. 

ముస్లింల త్యాగఫలంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో ఉందని తుమ్మల చెప్పారు. ముస్లింలు ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. అల్లాహ్ దయ, కృప కాంగ్రెస్ పై ఉంటాయని చెప్పారు. తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Thummala
Congress
Muslims

More Telugu News