Google: గూగుల్ లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సుందర్ పిచాయ్

Sundar Pichai Completes 20 Years In Google Says Im Still Feeling Lucky
  • ప్రోడక్ట్ మేనేజర్ గా కంపెనీలో మొదలైన తన ప్రస్థానం గురించి ఎమోషనల్ పోస్ట్
  • 20 ఏళ్ల సర్వీసులో సంస్థలో ఎన్నో మారాయని వెల్లడి
  • కానీ తనలో ఇంకా తొలిరోజు చేరిన నాటి ఉత్సాహమే కొనసాగుతోందని వ్యాఖ్య
ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్, ఆల్ఫాబెట్ లకు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ తాను సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2004లో గూగుల్ లో ప్రోడక్ట్ మేనేజర్ గా చేరనప్పటి నుంచి తన ప్రస్థానాన్ని ఓసారి నెమరువేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచి ఇప్పటివరకు తన 20 ఏళ్ల సర్వీసులో సంస్థలో ఎన్నో మార్పులు జరిగాయని చెప్పారు. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నారు.

“2004 ఏప్రిల్ 26.. గూగుల్ లో నా తొలి రోజు. నాటి నుంచి ఎంతో మారింది. సాంకేతికత, మా ఉత్పత్తులు ఉపయోగించే ప్రజల సంఖ్యతో పాటు, నా జుట్టు కూడా మారిపోయింది. కానీ ఈ గొప్ప కంపెనీలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం మారలేదు. 20 ఏళ్లు గడిచిపోయాయి.. నన్ను నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నా” అని సుందర్ పిచాయ్ తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. 20 అంకె ఆకారంలో ఉన్న రెండు బెలూన్లు, లావా విరజిమ్ముతున్నట్లుగా దీపం ఆకారంలోని జ్ఞాపిక, తన తొలి, ప్రస్తుత ఐడీ కార్డుల ఫొటోలను తన పోస్టుకు జత చేశారు.

సోషల్ మీడియాలో సుందర్ పిచాయ్ పోస్ట్ వైరల్ మారింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన పోస్ట్ కు 1.16 లక్షలకు పైగా లైక్ లు లభించాయి. చాలా మంది యూజర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీరు సాధించిన విజయాల్లో ఏది గొప్పదో నేను నిర్ణయించుకోలేకపోతున్నా. 20 ఏళ్లలో మీరు తీసుకొచ్చిన అన్ని రకాల సాంకేతిక పురోగతులా.. లేక 20 ఏళ్ల తర్వాత కూడా మీరు బట్టతల బారిన పడలేదనా!?’ అంటూ ఓ యూజర్ చమత్కరించాడు. మీరే నా స్ఫూర్తి అని మరో యూజర్ కామెంట్ చేయగా 20 ఏళ్ల మీ అంకితభావానికి అభినందనలంటూ మరో  నెటిజన్ కామెంట్ పెట్టాడు. 20 ఏళ్ల విజయాలు, వారసత్వం, అంకితభావానికి జేజేలంటూ మరొకరు స్పందించారు.

సుందర్ పిచాయ్ నాయకత్వంలో గూగుల్ దూసుకెళ్తోంది. ఎన్నో కొత్త ఉత్పత్తులు, సేవలపై కంపెనీ దృష్టిపెట్టేలా ఆయన దిశానిర్దేశం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అందిపుచ్చుకొని మరింత మెరుగ్గా కంపెనీ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
https://www.instagram.com/sundarpichai/?utm_source=ig_embed&ig_rid=66b4f22c-e10d-45c0-b0b3-d806ee4e0407
Google
Sundar Pichai
ceo
20 years
service
Instagram
post

More Telugu News