Ponnavolu Sudhakar Reddy: వైఎస్సార్ కోసం ఎదురొడ్డి పోరాడాను.. 2011లో వైఎస్, జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది: ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి

  • వైఎస్ పై కోర్టుకు శంకర్రావు లేఖ రాశారన్న పొన్నవోలు
  • 2011లో కేసు వేసే నాటికి జగన్ ను తాను చూడలేదని వెల్లడి
  • వైఎస్ మీద కేసు వేసి ఉంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనన్న పొన్నవోలు
Ponnavolu Sudhakar Reddy on YS Sharmila comments

తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడారని ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తాను కేసులు వేశానని షర్మిల పచ్చి అబద్ధాలు మాట్లాడారని... రాజకీయ లబ్ధి కోసమే తనపై ఆరోపణలు చేశారని విమర్శించారు. మహానుభావుడైన వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే... అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించానని... అందుకే కేసులు వేశానని చెప్పారు. తనతో ఎవరూ కేసులు వేయించలేదని తెలిపారు. 

వైఎస్సార్ మీద మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు కోర్టుకు లేఖ రాశారని... దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని... ఆ కేసులో టీడీపీ నేత ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయ్యారని పొన్నవోలు చెప్పారు. ఆ క్రమంలోనే వైఎస్సార్, జగన్ మీద 17/8/2011 న ఎఫ్ఐఆర్ నమోదయిందని తెలిపారు. 2011 డిసెంబర్ లో తాను కేసు వేసే నాటికి జగన్ ను చూడనేలేదని చెప్పారు. వైఎస్సార్ తో కలిసి జగన్ అక్రమాలు చేశారని కాంగ్రెస్ పార్టీనే ఇరికించిందని అన్నారు. అప్పటి ప్రభుత్వ జీవోలకు, జగన్ కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. 

జగన్ ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతోనే తాను బయటకు వచ్చానని... వైఎస్ మీద కేసు పెట్టడం అన్యాయమని తాను వాదించానని పొన్నవోలు చెప్పారు. వేరే 14 మందిని బాధ్యులుగా చేయాలనే తాను కేసు వేశానని చెప్పారు. వాటికి సంబంధించిన కాపీలను పంపిస్తానని... వాటిని చదివితే షర్మిలకు అన్ని విషయాలు అర్థమవుతాయని తెలిపారు. 

షర్మిల చెప్పినట్టు వైఎస్ మీద తాను కేసు వేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని పొన్నవోలు చెప్పారు. కాంగ్రెస్, సీబీఐ కలిసి కేసులో వైఎస్ ని ఇరికించాయని తెలిపారు. దీన్ని నిరూపించేందుకు తాను సిద్ధమని చెప్పారు. వైఎస్ వేధించిన వారికి ఎదురొడ్డి తాను పోరాడానని... అలాంటి తనను అభినందించాల్సింది పోయి, షర్మిల తనను విమర్శించడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలనే షర్మిల మాట్లాడుతున్నారని అన్నారు.

More Telugu News