miss universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్ గా 60 ఏళ్ల భామ!

In A First 60 Year Old Wins Miss Universe Buenos Aires Beauty Pageant
  • అందాల పోటీ టైటిల్ గెలుచుకున్న అర్జెంటీనా సుందరి అలెజాండ్రా మారిసా రోడ్రీగజ్
  • తొలిసారి ఈ వయసులో టైటిల్ గెలుచుకున్న మహిళగా రికార్డు
  • బ్యూటీ నిర్వచనం, వయసు అడ్డంకులను చెరిపేస్తూ కిరీటం సొంతం
  • కంటెస్టంట్లకు వయసు నిబంధనను గతేడాది ఎత్తేసిన మిస్ యూనివర్స్ సంస్థ
  • మెక్సికోలో సెప్టెంబర్ లో జరిగే మిస్ యూనివర్స్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతున్న రోడ్రీగజ్
అందాల పోటీల్లో కేవలం యవ్వనంలో ఉండే వారే పాల్గొనాలనే మూస ధోరణిని ఓ పెద్దావిడ పటాపంచలు చేసింది! అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసా రోడ్రీగజ్ మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్ టైటిల్ గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరించింది. తద్వారా తొలిసారి ఈ వయసులో బ్యూటీ క్వీన్ గా నిలిచి చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది!

అర్జెంటీనాలోని బ్యూనోస్ ఏరీస్ ప్రావిన్సు రాజధాని లా ప్లాటాకు చెందిన రోడ్రీగజ్ అందగత్తే కాదు.. ఓ లాయర్, జర్నలిస్టు కూడా. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నమాట. అందానికి ఉన్న సంప్రదాయ ప్రమాణాలు, వయసు అడ్డంకులను చెరిపేస్తూ ఆమె ఈ టైటిల్ ను గెలుచుకుంది. తద్వారా తన సామర్థ్యాం ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పింది.

ఆమె నవ్వు, సొగసు, సౌందర్యం వీక్షకులతోపాటు న్యాయ నిర్ణేతలను కట్టిపడేసింది. ఈ వయసులో అందాల కిరీటం సాధించిన తొలి మహిళగా రోడ్రీగజ్ నిలిచింది. ఇక వచ్చే నెల జరగనున్న మిస్ యూనివర్స్ అర్జెంటీనా–2024 అందాల పోటీల్లో బ్యూనోస్ ఏరీస్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రోడ్రీగజ్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేసిన వీడియోలు ఆమె చిత్తశుద్ధిని చాటిచెబుతున్నాయి. ఈ పోటీలో ఆమె గెలిస్తే విశ్వ వేదికపై జరిగే మిస్ యూనివర్స్ వరల్డ్ కాంటెస్ట్ లో ఆమె అర్జెంటీనా పతాకాన్ని ఎగరేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మెక్సికోలో మిస్ యూనివర్స్ పోటీలు జరగనున్నాయి.

అందాల పోటీల్లో ఈ నూతన మార్పుకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు పులకరించిపోతున్నా. మహిళలంటే భౌతిక స్వరూపమే కాదు.. మరెన్నో విలువల సమాహారమని చాటిచెప్పే కొత్త వేదికను మేం ప్రారంభించబోతున్నాం’ అని ఈ పోటీలో కిరీటం గెలుచుకున్నాక రోడ్రీగజ్ మీడియాకు తెలిపింది.

అందాల పోటీలకు వయసు పరిమితి నిబంధనను మిస్ యూనివర్స్ సంస్థ గతేడాది తొలగించింది. దీంతో ఈ ఏడాది నుంచి 18 ఏళ్లు దాటిన అతివలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభించింది. గతంలో 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండే అందాల భామలే ఈ పోటీలో పాల్గోనాలనే నిబంధన ఉండేది.

ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో ఓ నడివయసు భామ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హైదీ క్రూజ్ అనే 47 ఏళ్ల మహిళ డోమినికన్ రిపబ్లిక్ తరఫున ఈ పోటీల్లో పాల్గొననుంది.
miss universe
argentina woman
beauty pageant
buenos aires
win

More Telugu News