నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది: రాబర్ట్ వాద్రా
- ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న వాద్రా
- బీజేపీని వదిలించుకోవాలని ఓటర్లు భావిస్తున్నారని వ్యాఖ్య
- గాంధీ కుటుంబానికి ప్రజల మద్దతు వుందని ధీమా
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తాను సిద్ధమేనని వాద్రా పరోక్షంగా వెల్లడించారు. అమేథీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పారు. అమేథి నియోజకవర్గ ప్రజలతో తనకు 1999 నుంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచి లోక్ సభలో అడుగుపెట్టిన బీజేపీ లీడర్ స్మృతి ఇరానీ అమేథీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వాద్రా ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీని వదుల్చుకోవడానికి వేచి చూస్తున్నారని చెప్పారు. అయితే, రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల నుంచి ఎవరిని బరిలోకి దింపాలనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని రాబర్ట్ వాద్రా వివరించారు.