black man: అమెరికాలో నల్ల జాతీయుడి అరెస్టు సందర్భంగా పోలీసుల దురాగతం

US Cop Pins Down Black Man Killing Him Then Brags About Bar Fights
  • అతన్ని నేలపై బోర్లా పడేసి మెడను మోకాలితో అదిమిపట్టిన ఓ పోలీసు
  • ‘ఊపిరాడట్లేదు.. కాపాడండి’ అని మొత్తుకున్నా కనికరించని వైనం
  • నువ్వు బాగానే ఉన్నావంటూ వ్యాఖ్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతని మృతి
  • 2020లో జరిగిన జార్జి ఫ్లాయిడ్ తరహా ఉదంతం ఒహాయోలో పునరావృతం
అమెరికాలో 2020లో పోలీసుల జాత్యహంకారానికి బలైన జార్జి ఫ్లాయిడ్ తరహా ఘటన పునరావృతమైంది. ఒహాయో రాష్ర్టంలో ఓ నల్ల జాతీయుడి అరెస్టు సందర్భంగా పోలీసులు సాగించిన దురాగతం బయటపడింది. కాంటన్ పోలీస్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన పోలీసుల బాడీ కెమెరా వీడియో ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఈ నెల 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఓ కారు ప్రమాద ప్రాంతం నుంచి పరారైన కేసులో అనుమానితుడైన 53 ఏళ్ల ఫ్రాంక్ టైసన్ అరెస్టుకు సంబంధించిన దృశ్యం ఆ వీడియోలో రికార్డయింది. ఓ బార్ లో ఉన్న అనుమానితుడిని ఒహాయో పోలీసులు  అరెస్టు చేసేందుకు వచ్చిన సమయంలో వారి మధ్య తొలుత కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం టైసన్ ను పోలీసులు బలప్రయోగంతో కింద పడేశారు. బోర్లా పడిన అతని చేతులను వెనక్కి విరిచి ఒక పోలీసు అధికారి బేడీలు వేస్తుండగా మరో పోలీసు అధికారి అతని మెడను తన మోకాలితో గట్టిగా అదిమి పట్టాడు. తనకు ఊపిరి ఆడట్లేదని, కాపాడాలని టైసన్ పలుమార్లు మొత్తుకున్నా వారు పట్టించుకోలేదు. మెడను అదిమిపట్టిన పోలీసు అధికారి ‘నువ్వు బాగానే ఉన్నావు’ అంటూ వ్యాఖ్యానించాడు. ‘బార్ లో జరిగే గొడవలో భాగం కావాలని నేనెప్పుడూ అనుకొనే వాడిని’ అంటూ సహచరులతో ఆ అధికారి పేర్కొనడం ఆ ఫుటేజీలో వినిపించింది. 

చేతులకు బేడీలు వేసిన తర్వాత కూడా నేలపై పడి ఉన్న టైసన్ సాయం కోసం అర్థించాడు. కొన్ని నిమిషాల తర్వాత అతనిలో చలనం లేదని గమనించిన పోలీసులు వెంటనే సీపీఆర్ చేశారు. అప్పటికీ అతనిలో కదలికలు లేకపోవడంతో పారామెడిక్స్ కు సమాచారం అందించారు. దీంతో అత్యవసర వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని టైసన్ ను స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.

టైసన్ మృతికి కారణమైన పోలీసులను బ్యూ స్కోనేజ్, కామ్ డెన్ బర్క్ గా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ కేసును ఒహాయా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తుండటంతో వారిని సెలవులో ఇంటికి పంపారు.

టైసన్ మృతి 2020లో చోటుచేసుకున్న జార్జి ఫ్లాయిడ్ మృతిని గుర్తుచేసింది. ఫ్లాయిడ్ ను అరెస్టు చేసే సమయంలో  మిన్నెపోలిస్ రాష్ర్ట పోలీసులు అతని గొంతుపై మోకాళ్లు అదిమిపెట్టడం, ఊపిరాడట్లేదని చెప్పినా పట్టించుకోకపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ ఘటనకు బాధ్యులైన పోలీసులను కఠినంగా శిక్షించాలంటూ అమెరికా వ్యాప్తంగా నల్ల జాతీయులు రోడ్డెక్కారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. ఆఫ్రికా దేశాలతోపాటు ప్రపంచ దేశాల్లోనూ నిరసనలు జరిగాయి.
black man
arrest
ohio police
america
killed

More Telugu News