Lok Sabha Polls: ముఖం చాటేసిన బెంగళూరు ఓటర్లు.. దాదాపు సగం మంది ఓటింగ్‌కు దూరం

Nearly Half Of Bengaluru Voters Skip Voting In Lok Sabha Polls 2nd Phase
  • నగర పరిధిలోని మూడు స్థానాల్లో దాదాపు 50 శాతానికే పరిమితమైన పోలింగ్
  • సిటీ వాసుల ఓటింగ్ పెంచడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు వృథా
  • గ్రామీణ ప్రాంతంలో నమోదయిన మెరుగైన ఓటింగ్
లోక్‌సభ ఎన్నికలు-2024 రెండవ దశ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. వేర్వేరు రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. ఈ దశలో బెంగళూరు మహానగరం కూడా భాగమయ్యింది. అయితే నగరానికి చెందిన దాదాపు సగం మంది ఓటర్లు ముఖం చాటేశారని పోలింగ్ డేటా స్పష్టం చేస్తోంది. కర్ణాటకలో శుక్రవారం 14 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగగా 69.23 శాతం పోలింగ్ నమోదయింది. అయితే నగరంలోని మూడు అర్బన్ నియోజకవర్గాలలో తక్కువ పోలింగ్ నమోదయింది.

బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్‌లలో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. బెంగళూరు సెంట్రల్‌లో 52.81 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.42 శాతం, బెంగళూరు సౌత్‌లో 53.15 శాతం పోలింగ్ శాతాలు నమోదయాయి. అంటే దాదాపు 50 శాతం మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్టు స్పష్టమైంది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ గణాంకాల విషయానికి వస్తే బెంగళూరు సెంట్రల్‌లో 54.32 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.76 శాతం, బెంగళూరు సౌత్‌లో 53.70 శాతం పోలింగ్ నమోదయింది. 

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అనేక కార్యక్రమాలు చేపట్టింది. వివిధ యాప్‌లను ఉపయోగించేలా ఓటర్లను ప్రోత్సహించారు. సులభంగా పోలింగ్ బూత్‌లను గుర్తించేందుకు వీలుగా ఓటర్ స్లిప్‌లపై క్యూఆర్ కోడ్‌లను కూడా ముద్రించారు. ‘మీ అభ్యర్థి ఎవరో తెలుసుకోండి’ అనే పేరిట ఒక హెల్ప్ లైన్, పోలింగ్ బూత్‌లకు సంబంధించి అందుబాటులో ఉన్న పార్కింగ్ సౌకర్యాలతో పాటు ఇతర చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ నిరాశే ఎదురైంది. 

నగరంలోని పోలింగ్ బూత్‌ల వద్దకు ఓటర్లు రాకపోవడానికి వేసవి తాపం కూడా ఒక కారణమవ్వొచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, తక్కువ పోలింగ్ శాతం నమోదయిందని ఈసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే బెంగళూరు రూరల్‌లో కాస్త మెరుగ్గా 67.29 శాతం ఓటింగ్ నమోదయింది. అయితే కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మాండ్యాలో 81.48 శాతం, కోలార్‌లో 78.07 శాతం పోలింగ్‌ నమోదయాయి.
Lok Sabha Polls
Bengaluru
2nd Phase poll
Karnataka

More Telugu News